ఈనెల 4న ఆర్మూర్ మున్సిపల్​ అవిశ్వాస తీర్మానం

by Sridhar Babu |
ఈనెల 4న ఆర్మూర్ మున్సిపల్​ అవిశ్వాస తీర్మానం
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై మున్సిపల్ కౌన్సిలర్లు ఇచ్చిన వినతి మేరకు అవిశ్వాస సమావేశం గురువారం జరగనుంది. దాంతో ఇరు వర్గాల నాయకులు క్యాంపు రాజకీయాలకు తెర లేపారు. దీంతో ఆర్మూర్ మున్సిపల్ రాజకీయం నువ్వా నేనా అన్నట్టు మారింది. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సహకారంతో పండిత్ వినీత పవన్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.

కానీ బీఆర్ఎస్ స్వపక్షంలోనే విపక్షం తయారై గత ఏడాది డిసెంబర్ 12న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ను కలిసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన 24 మంది కౌన్సిలర్లు ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై అవిశ్వాసం పెట్టాలని సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ కౌన్సిలర్ల వినతి పత్రాన్ని పరిశీలించి ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ పార్టీలకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ల బలాబలాలను

తెలుసుకొనేందుకు అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా మున్సిపల్ చైర్ పర్సన్ పదవీకాలం ఇంకా 13 నెలలు మిగిలి ఉండడంతో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు కాందేష్ సంగీత శ్రీనివాస్, అయ్యప్ప వన్నెల దేవి, లావణ్య శ్రీనివాస్ లు మున్సిపల్ చైర్ పర్సన్ సీటును ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.

తీర్మానం నెగ్గేనా.. వీగేనా...

ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గేనా.. వీగేనా అనే ఉత్కంఠ పట్టణ ప్రజల్లో తీవ్రంగా నెలకొంది. ఇప్పటికే పండిత్ వినీత పవన్ వర్గంతో పాటు వ్యతిరేక వర్గం కౌన్సిలర్లు క్యాంపులకు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆర్మూర్ మున్సిపల్ లో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్ పండి వినిత పవన్ నిర్వహిస్తున్న క్యాంపులో 10 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉండగా, వ్యతిరేక గ్రూపులో 20 మంది ఉన్నారు. బీజేపీకి 5 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ నియోజకవర్గ అనుబంధ కౌన్సిలర్ గా కొంతం మంజుల మురళి ఒకరు ఉన్నారు. బీజేపీకి చెందిన ఐదుగురు మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాసం విషయంలో రెండు వర్గాలుగా మారినట్లు తెలిసింది. ఒక వర్గం అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుదామని, మరో వర్గం గైర్హాజరవుదామని భావిస్తున్నట్టు సమాచారం.

అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని పెట్టించిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లలో 15 మంది హిందూ కౌన్సిలర్లు, 4 మైనార్టీ కౌన్సిలర్లు, మరొక మైనార్టీ ఎంఐఎం పార్టీ కౌన్సిలర్ ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో పూర్తిగా హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ సభ్యులు సమావేశానికి హాజరు కావడం కష్టమేనని సమాచారం. ఏది ఏమైనా ఈ నెల 4 న ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారుల సమక్షంలో జరగనున్న మున్సిపల్ అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా.. వీగి పోతుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story