మున్సిపాలిటీ వాహనాలకు నో.. రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్

by Shiva |
మున్సిపాలిటీ వాహనాలకు నో.. రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్
X

దిశ, ఆర్మూర్: నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలోని సుమారు 35 మున్సిపల్ వాహనాలకు ఎలాంటి ఇన్సూరెన్స్‌లు లేకుండా ఎంచక్కా దర్జాగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో తిరుగుతున్నాయి. ఆర్మూర్ మున్సిపల్‌లో 22 ఆటోలు, 9 ట్రాక్టర్లు, 2 బ్లేడ్ ట్రాక్టర్లు, 1 జేసీసీ, 1 స్లీపింగ్ మిషన్ ఉన్న ఏ ఒక్క వాహనానికి ఇన్సూరెన్స్ చేయకపోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మున్సిపల్ కార్యాలయంలోని వాహనాల ద్వారా మున్సిపల్ పరిధిలో చెత్త చెదారాలను, డ్రైనేజీ మురుగు వ్యర్థ పదార్థాలను, రోడ్లను పరిశుభ్రం చేయడం తదితర పనులతో అనునిత్యం ప్రధాన రోడ్ల పైన జనసంచారం మధ్యలోనే చెక్కర్లు కొడుతున్నాయి.

ఈ మున్సిపల్ వాహనాల వ్యవహారాన్ని అంతా ఆర్మూర్ మున్సిపల్ జనం ప్రతినిత్యం కళ్లారా చూస్తూ ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. సమాజంలో బ్రతుకు జీవనం సాగించే సామాన్య ప్రజలకు ఒక రూల్.. మున్సిపల్‌కు మరో రూలు ఉంటుందా అని మున్సిపల్ పాలకవర్గ, అధికారుల తీరు పట్ల జనం తీవ్రంగా చర్చించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి నిబంధనలు ఉండవా అని విమర్శలు గుప్పిస్తున్నారు. సాధారణంగా ఏ వాహనాలకు అయినా వాహనాల కొనుగోలు సందర్భం ముగిసిన వెంటనే వాహనాలకు, రోడ్డు ప్రమాదాల జరిగినప్పుడు భరోసాగా ఉంటుందని రవాణా శాఖ నిబంధనలు పాటించి రిజిస్ట్రేషన్లు చేయించి ఇన్సురెన్సులు చేయిస్తారు. కానీ, ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలోని 35 వాహనాలకు ఎలాంటి ఇన్సూరెన్స్‌లు చేయించకుండా రోడ్లపై ఎంచక్కా తిరుగుతున్న ఆర్టీఏ, పోలీస్ అధికారులు మిన్నకుండిపోవడం గమనార్హం.

సామాన్య ప్రజలు వారి వాహనాలకు రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్‌లు చేయకపోతే కంటబడితే ఆలస్యం ఆ వాహనాలు ఆర్టీఏ, పోలీసు అధికారులు జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం అందరికీ తెలిసిందే. వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే చుక్కలు చూపించే అధికారులు చెత్త సేకరణకు వినియోగించే మున్సిపల్ వాహనాలు ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్‌లు లేకుండానే రోడ్లపై తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారనే విషయంపై మున్సిపల్ పాలకవర్గ అధికార సభ్యులు నోరెత్తకపోవడం విడ్డూరంగా ఉంది. పైగా ఆ వాహనలు తమ హయాంలో కొనుగోలు చేయలేదని మేమెందుకు పట్టించుకోవాలని పాలకవర్గం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.

బీఎస్-6కు బదులు బీఎస్-4 వాహనాల కొనుగోలు

ఆర్మూర్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా చెత్త తీసుకెళ్లడానికి 22 ఆటోలతో పాటు 9 ట్రాక్టర్లు, 2 బ్లేడ్ ట్రాక్టర్లు , 1 జేసీబీ, 1 స్విపింగ్ మిషన్ వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలలో 12 ఆటోలు, 3ట్రాక్టర్లకు, ఓ జేసీబీకి రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్ గత మూడేళ్లుగా లేవు. ఆ వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఏ ధరకు కొనుగోలు చేశారో రసీదులైనా ఉన్నాయా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని అడిగితే ఫైళ్లు వెతకాల్సి ఉందని సంబంధిత అధికారులు పొంతన లేని సమాధానలు చెబుతూ తప్పించుకుంటున్నారు. అయితే, ఆర్మూర్ మున్సిపాలిటీలో సుమారు 2001 సంవత్సరంలో అప్పటి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు చిత్త సేకరణ కోసం పాత వర్షన్ ఆటోలను కొనుగోలు చేశారు. బీఎస్-6 ఇంజన్ వాహనాలు నడుస్తున్న ఆ సమయంలో వాటిని కాదని నాలుగు ఏళ్ల క్రితం అమ్మకాలు జరిపిన బీఎస్-4 ఇంజన్ ఉన్న వాహనాలను కొనుగోలు చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది. మొత్తం విషయాలపై అప్పటి మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ డీ, ఏఈ, ఇతర మున్సిపల్ పాలకవర్గ సభ్యులు నిజనిజాకలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

వెలుగులోకి వాహనాల ఇన్సూరెన్స్ వ్యవహారం..

ఇటీవల మున్సిపాలిటీ ట్రాక్టర్‌ డ్రైవర్ ఓ ద్విచక్ర వాహన‌దారుడిని ఢికొట్టగా అతడు మృతి చెందాడు. కేసు విచారణలో భాగంగా ట్రాక్టర్‌కు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్సులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో గల మున్సిపల్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ లేవనే అంశం వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ ఎంవీఐ సైతం మున్సిపాలిటీలోని వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించాలని మున్సిపల్ అధికారులకు సూచించినట్లు ఆలస్యంగా తెలిసింది. కానీ, వాహనాల గురించి రిజిస్ట్రేషన్ లేవని ఇటీవల పలు వాహనాలను ఆపి ఆర్మూర్‌లోని ఆర్టీసీ ప్రాంగణంలో ఉంచి ఆర్టీఏ అధికారి నిలుపగా వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ వాహనాలను విడిపించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు చొరవ చూపి వాహనాలకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ చేయించి నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story

Most Viewed