కాంగ్రెస్ సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు..ఏమన్నారంటే..?

by Naveena |
కాంగ్రెస్ సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు..ఏమన్నారంటే..?
X

దిశ ప్రతినిధి నిజామాబాద్ డిసెంబర్ 30: అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం పూర్తి చేసుకున్న, కాంగ్రెస్ పాలన ఏడాదిలోనే ప్రజాదరణ కోల్పోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ లోని బీఆర్ఎస్ భవన్ లో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, అమలు తీరుపై విమర్శలు గుప్పించారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కేసిఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు సంక్షేమ పథకాలు అందించామని కవిత అన్నారు. కన్నబిడ్డల్లా చూసుకున్న కేసిఆర్ ను, బీఆర్ ఎస్ నాయకులను ఎందుకు ఓడించామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నట్టు ఆమె తెలిపారు. దూరపు కొండలు నునుపు అన్న చందంగా కాంగ్రెను నమ్మి గెలిపిస్తే ఆపార్టీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నదో ఇప్పుడు పూర్తిగా ప్రజలకు అర్థమైందన్నారు. ఎలాగైనా గెలవాలనే తాపత్రయంతో కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ముఖం చాటేస్తోందన్నారు. ప్రజలు నమ్మి గెలిపిస్తే అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ప్రజలకు ఏదైనా మంచి చేశారా అంటే అదీ లేదన్నారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఆరు నెలలుగా కమిషనర్ పోస్టు భర్తీ చేయించే పరిస్థితి కూడా లేదన్నారు. కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ పెరుగుతోందని, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జాతీయస్థాయి నాయకుడునని చెప్పుకునే షబ్బీర్ అలీ, మరో పక్క సుదర్శన్ రెడ్డి ఇంతటి పెద్ద పెద్ద లీడర్లున్నా కమిషనర్ పోస్టులు మాత్రం భర్తీ చేయించలేకపోతున్నారని కవిత ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17 వరకు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాయ మాటలు చెబుతూ..కాలయాపన చేస్తున్నారు తప్ప ఫ్యాక్టరీ తెరిపించే విషయంపై ఫోకస్ చేయడం లేదని విమర్శించారు.

Advertisement

Next Story