Telangana University: తెలంగాణ యూనివర్సిటీ భూములపై కబ్జా రాయుళ్ల కన్నూ

by Mahesh |
Telangana University: తెలంగాణ యూనివర్సిటీ భూములపై కబ్జా రాయుళ్ల కన్నూ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. కొందరు కబ్జాదారులు గ్యాంగ్‌ను ఏర్పాటుచేసుకుని ప్రభుత్వస్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆక్రమణదారుల కన్ను ప్రభుత్వభూములపై పడింది. ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 54 ఎకరాల భూములు ప్రమాదంలో పడ్డాయి. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఈ భూముల వివాదం కొనసాగుతూనే ఉందని తెలిసింది. జిల్లాకు చెందిన ఓ రాజకీయ నేత వివాదాస్పద భూములు తమవేనంటూ కోర్టు మెట్లెక్కారు. గతంలో జిల్లా కోర్టులో ఆ భూములు యూనివర్సిటీకే చెందినవని తీర్పు రాగా, ఆ తీర్పుపై హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో ఇప్పుడు ఆ భూములు యూనివర్సిటీ చేజారే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి శివారులో ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీకి 578.02 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. యూనివర్సిటీకి భిక్నూర్‌లోని సౌత్ క్యాంపస్ తో పాటు మరో చోట భూములున్నాయి. సర్వే నెంబర్లు వరుసగా 267, 334, 265, 277, 278, 603 లలో 501.09 ఎకరాలు., సర్వే నెంబర్ 264 లో 69.21 ఎకరాలు. మరి కొన్ని సర్వే నెంబర్లతో 7.04 ఎకరాలు మొత్తం కలిపి నికరంగా 578.02 ఎకరాల విస్తీర్ణంతో భూమిని సేకరించి తెలంగాణ యూనివర్సిటీకి కేటాయించారు. సర్వే విభాగం, రెవెన్యూ విభాగం పంచనామా చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూమికి హద్దులు చూపించి ఇట్టి భూమిని తెలంగాణ యూనివర్సిటీ అప్పటి వైస్ ఛాన్సలర్‌కు స్వాధీనపరిచారు. ఈ భూముల్లో విద్యా కార్యక్రమాలతో పాటు పరిపాలనా సంబంధమైన నిర్మాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించారు. యూనివర్సిటీకి కేటాయించిన భూముల చుట్టూ ఎత్తైన ప్రహరీగోడను కూడా బలంగా నిర్మించారు. ఈ ప్రహరీ గోడ నిర్మించే క్రమంలో 2011లో రోజారాణి, శీతల్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సర్వేనెంబర్ 334లో 50 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి కాదని, ఆ భూమి తమ సొంత భూమి అంటూ నిజామాబాద్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. 2012లో నిజామాబాద్ జిల్లా సివిల్ కోర్టులో వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

సర్వేనెంబర్ 334 లోని 50 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అంటూ తీర్పునిచ్చింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 2018 లో సదరు వ్యక్తులు హైకోర్టును సంప్రదించారు. తిరిగి వాద ప్రతివాదనల అనంతరం 2 ఏప్రిల్, 2024 లో హైకోర్టు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కాపీని ఆర్డీవో యూనివర్సిటీకి పంపారని రిజిస్ట్రార్ యాదగిరి తెలిపారు. గతంలో యూనివర్సిటీ వీసీ గా ఉన్న బుర్రా వెంకటేశం ద్వారా రిజిస్టర్ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేశం విశ్వవిద్యాలయం భూములను పరిరక్షించాలని కలెక్టర్ గారికి సూచించారన్నారు. వైస్ ఛాన్సలర్ సూచన మేరకు రిజిస్ట్రార్ భూమిని పరిరక్షించే విషయంపై కోర్టును ఆశ్రయించాలని కలెక్టర్‌ను కోరుతూ లేఖను అందించినారు. ఈ లేఖకు స్పందించిన కలెక్టర్ రిజిస్టర్ సమక్షంలోనే ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని ఆర్డీఓ, ఏడీ సర్వేయర్లను తెలంగాణ విశ్వవిద్యాలయం భూమిని సర్వే చేసి నివేదికను కలెక్టర్ ఆఫీస్ లో సమర్పించాలని ఆదేశించారు.

సబ్ కలెక్టర్ ఆదేశాలతో సెప్టెంబర్ నెలలోనే సర్వే పూర్తి చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం భూమికి సంబంధించిన దస్తావేజులన్ని జిల్లా రెవెన్యూ కార్యాలయంలో భద్రపరుస్తారని రిజిస్టర్ తెలిపారు. విశ్వవిద్యాలయ భూమికి సంబంధించిన న్యాయ సంబంధమైన అంశాలన్ని రెవెన్యూ విభాగం పర్యవేక్షణలోనే ఉంటాయని రిజిస్టర్ పేర్కొంటున్నారు. వివాదాస్పదంగా మారిన భూముల పరిధిలో యూనివర్సిటీ భూముల చుట్టూ నిర్మించతలపెట్టిన ప్రహరీ గోడ నిర్మాణాన్ని కూడా అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ భూముల్లో మొక్కజొన్న పంటలు, ఇతర పంటలు కూడా పండించుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే కొందరు వ్యక్తులు ప్రహరీ గోడ కూలిపోయే విధంగా గోడకు దగ్గరగా భూమిని తవ్వుకుంటూ పోతున్నారు. ఇప్పటికే అక్కడక్కడ ప్రహరీ గోడను కూడా ధ్వంసం చేశారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఐక్యంగా నిలబడి యూనివర్సిటీ భూములను కాపాడాలని యూనివర్సిటీ విద్యార్ధులు, ఉద్యోగులు కోరుతున్నారు.

Advertisement

Next Story