రెండు గంటల వర్షం.. 24 గంటల కష్టాలు

by Sumithra |
రెండు గంటల వర్షం.. 24 గంటల కష్టాలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికలకు 36 గంటల ముందు నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం ప్రజలకు 24 గంటల కష్టాలను తెచ్చి పెట్టాయి. ప్రధానంగా వరి పండించి తూకాల కోసం ఆరుబయట ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కల్లాల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయింది. గంటల వ్యవధిలో దంచి కొట్టిన రాళ్ళ వాన దెబ్బకు ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. పేద ఇళ్ళ కప్పులు ఎగిరిపోయాయి. నిజామాబాద్ నగరానికి మంగళవారం రాత్రి కాలరాత్రిగా మిగిలిపోయింది. దాదాపు 12 గంటల కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపోవడంతో పాటు 33 కేవీ ఫీడర్ నుంచి రావాల్సిన విద్యుత్ సరఫరాకు ఈ వ్యవహరం తీవ్ర అంతరాయం కల్గించింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్ నగరంలో చాలా చోట్ల పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. అవి విద్యుత్ తీగల పై పడడంతో వాటిని పక్కకు తప్పించడం తలకు మించిన పనైంది.

విద్యుత్ శాఖాధికారులకు, పోలీసులకు, రెవెన్యూ అధికారులకు మంగళవారం జాగరణ తప్పలేదు. 12 గంటల పాటు కరెంట్ లేక నగర వాసులకు ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. కొన్ని ప్రాంతాల్లో 24 గంటలు గడిచిన కరెంట్ కష్టాలు తప్పలేదు. తాగునీటితో పాటు కరెంట్ లేక ఫోన్ లకు చార్జింగ్ లేక ప్రజలు విలవిలలాడిపోయారు. పలు ప్రాంతాల్లో రేకులఇళ్లు, పూరిళ్ళకు తీవ్ర నష్టం కలిగింది. పలు ప్రాంతాల్లో పత్తి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. మోపాల్, డిచ్ పల్లి మండలాల మధ్య సుమారు 80 ఎకరాల పత్తి నేలరాలిపోయింది. రాత్రి కురిసిన వడగళ్ల వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఎలక్షన్ కోడ్ కారణంగా ఎన్నికలకు గంటల గడువే ఉండడంతో అధికారులు ఎవ్వరు వారిని పట్టించుకోలేదు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులే ఎలాంటి హడావుడి లేకుండా వారిని పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ కారణంగా ధాన్యం సేకరణ పై అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలకు, బస్తాలు తూకాలు వేసి ఉంచడంతో అక్కడ అకాల వర్షానికి తీవ్రనష్టం ఏర్పడింది. బుధవారం ఈ విషయంలో అధికారులెవ్వరు ప్రకటన చేయలేదు. అటు పౌర సరఫరాల అధికారులు, ఇటు వ్యవసాయ శాఖాధికారులు పంట నష్టం, తడిసిన ధాన్యం వివరాలు వెల్లడించలేదు. ఎన్నికలు ముగిస్తే కానీ అకాల వర్షానికి జరిగిన నష్టం గురించి బహిర్గతమయ్యే అవకాశాలు లేవు.

Next Story

Most Viewed