పోలీసుల పేరు చెప్పి రౌడిషీటర్ల వద్ద వసూళ్లు..

by Sumithra |
పోలీసుల పేరు చెప్పి రౌడిషీటర్ల వద్ద వసూళ్లు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో జనవరి 1న జరిగిన రౌడిషిటర్ జంగల్ ఇబ్రహీం ఆలియాస్ ఇబ్రహీం చావూస్ ఆలియాస్ జంగల్ ఇబ్బు హత్య కేసులో నిందితులపై పీడీ యాక్టు నమోదు కాకుండా చూస్తామని ఓ దళారి వసూళ్ల పర్వానికి తెర లేపాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మైనార్టీ నాయకుడు, మాజీ రౌడిషిటర్ ఆధ్వర్యంలో ఈ వసూళ్ల కార్యక్రమం జరుగుతున్నట్లు సమాచారం. నగరంలోని హైమద్ పూర కాలనీకి చెందిన లాయర్ అని పేరు చెప్పుకుని తిరిగే వ్యక్తి జంగల్ ఇబ్బు హత్య కేసులో నిందితుల కుటుంబసభ్యుల నుంచి డబ్బులు వసూల్ చేసినట్లు సమాచారం.

జనవరి 1న నగర శివారులోని నెహ్రూనగర్ వద్ద గల ఫాంహౌస్ సమీపంలో జంగల్ ఇబ్బు హత్యకు గురైన విషయం తెల్సిందే. జంగల్ ఇబ్బును రౌడిషిటర్ ఆరీఫ్ ఆలియాస్ ఆరీఫ్ డాన్ ఆధ్వర్యంలోని 13 మంది హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో 15 మందిపై పోలీసులు కేసునమోదు చేశారు. జంగల్ ఇబ్బు హత్యకు నిజామబాద్ నగరంలోని పీడీఎస్ మాఫియాకు సంబంధించిన వసూళ్లే కారణమనే విషయం విధితమే. మామూళ్లకు సంబంధించిన గొడవలను పరిష్కరించుకుందామని పిలిచి రౌడిషిటర్ జంగల్ ఇబ్బును హత్య చేసిన విషయం తెల్సిందే. బర్త్ డే పార్టీ వేదికగా నమ్మించి జంగల్ ఇబ్రహీంను హత్య చేసిన గ్యాంగ్ ప్రస్తుతం నిజామాబాద్ సారంగాపూర్ జైల్ లో ఉన్న విషయం తెల్సిందే.

జంగల్ ఇబ్బు హత్యకేసు నిందితుల్లో కొందరిపై ఇది వరకే పీడీ యాక్టుతో పాటు రౌడిషిట్ లు ఉండడం తరుచుగా గొడవలు, దాడులు చేస్తున్న నేపథ్యంలో పోలీసుశాఖ వారిలో కొందరి పై పీడీయాక్టు కేసుకు సిద్దమైంది. పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఆదేశాల మేరకు పీడీ యాక్టు నమోదు కోసం పోలీసు అధికారులు సమాయత్తమయ్యారు. ఇదే విషయం తెలిసిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడు, మాజీ రౌడిషిటర్, డూబ్లికేట్ లాయర్ కలిసి పీడీ యాక్టునమోదు కాకుండా చూస్తామని వసూళ్ల పర్వానికి తెరలేసినట్లు తెలిసింది. సుమారు 12 లక్షల వరకు వసూల్ చేసినట్లు తెలిసింది. హత్య కేసులో ప్రఁధాన నిందితుల వద్ద డబ్బులు లేకపోయినా వారికి సంబంధించిన బోధన్ రోడ్డులోని ప్రాపర్టీని తనాఖా పెట్టి మరీ వసూల్ చేసినట్లు తెలిసింది.

నిజామబాద్ నగరంలో జరిగిన జంగల్ ఇబ్బు ఆద్యాంతం వసూళ్ల ఆరోపణలు నెలకొని ఉన్నాయి. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితులను తప్పించడానికి వసూళ్లు జరిగాయని విమర్శలు నిజామాబాద్ పోలీసులు మూఠ గట్టుకున్నారు. అంతేగాకుండా క్రైం సీన్ రిక్రియేషన్ లోనూ కొందరికీ సడలింపు ఇవ్వడంలోనూ మతలబు ఉందని వాదనలు ఉన్నాయి. జంగల్ ఇబ్రహీం సోదరి తన ఫిర్యాదులో పీడీఎస్ మాఫియా డాన్ సూత్రదారి అని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా అతని పేరును అందులో చేర్చకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

నిజామాబాద్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ సంగతి దేవుడెరుగు కానీ నేరాలు జరిగితే నేరస్తులతో పాటు బాధితుల నుంచి ముక్కుపిండి వసూల్ చేస్తున్నారనే ఆరోపణలను మూటగట్టుకుంది. జంగల్ ఇబ్బు హత్య కేసులో పలువురు నిందితుల నేరచరిత్ర తీవ్రంగా ఉండగా ఆ కేసు తర్వాత నగరం ప్రశాంతంగా ఉన్న సమయంలో వారిని కఁఠినంగ శిక్షించి జైలులోనే ఉంచాల్సిన పోలీసు శాఖ పీడీ యాక్టు నమోదు చేయడంలో తాత్సారం చేస్తుండడంతో దళారుల కాసుల పంట పండుతుందని చెప్పాలి. పోలీస్ స్టేషన్ ల వద్ద పైరవీలు చేసే దళారులు ఏకంగా మర్డర్ కేసులోనూ లాబీయింగ్ చేశారని అంతా కోడై కూస్తోంది. ఇప్పుడు పీడీ యాక్టు నమోదులోనూ పోలీసులు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కావడం అందుకు బలాన్ని చేకూరుస్తుంది.

Advertisement

Next Story