అలా ఎలా జరిగింది ?...ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో వ్యవహారం పై ఫోన్లు

by Sridhar Babu |
అలా ఎలా జరిగింది ?...ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో  వ్యవహారం పై ఫోన్లు
X

దిశ, భిక్కనూరు : సర్వీస్ బుక్ బదిలీ చేసేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన భిక్కనూరు ఎంపీడీఓ సంతోష్ రెడ్డి వ్యవహారం కిందిస్థాయి సిబ్బందికి తలనొప్పిగా తయారైంది. ఉదయం నుంచి జిల్లా నలుమూలల నుంచి అధికారులు ఇక్కడ పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బందికి ఫోన్ చేసి అలా ఎలా జరిగిందంటూ ఫోన్లు చేసి వివరాలు అడుగుతున్నారు. దీంతో వారికి సమాధానాలు చెప్పలేక తలలు బాదుకుంటున్నారు. నెల రోజుల క్రితమే కమ్మర్ పల్లి నుండి బదిలీపై వచ్చిన ఆయన 15 రోజుల క్రితం సెలవు పెట్టి కాశీ యాత్రకు వెళ్లాడు. రెండు రోజుల క్రితమే కార్యాలయానికి చేరుకొని ఎంపీఓ ప్రవీణ్ కుమార్ నుంచి ఎంపీడీఓ గా చార్జ్ తీసుకున్న

ఆయన ఏసీబీకి చిక్కడం కింది స్థాయి సిబ్బందిని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. బుధవారం ఎంపీడీఓ కార్యాలయాన్ని "దిశ" విజిట్ చేసింది. కార్యాలయం అంతా నిశ్శబ్ద వాతావరణం ఆవహించడం, నిన్న మొన్నటి వరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సమస్యల పరిష్కారానికి కార్యాలయానికి వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధులతో రద్దీగా హడావిడిగా కనిపించే కార్యాలయం ఒక్కసారిగా సైలెంట్ గా మారింది. కార్యాలయంలోని చాంబర్లు కొన్ని తెరిచి ఉండగా, మరి కొన్ని చాంబర్లు తెరిచి ఉన్నప్పటికీ ఎటువంటి సందడి కనిపించక వెలవెలబోయాయి. కొందరు సిబ్బంది నిన్నటి షాక్ నుంచి తేరుకోలేక సెలవు పెట్టగా, మండలంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసే కార్యదర్శులు సైతం ఎంపీడీఓ కార్యాలయంలో మాత్రం కనిపించలేకపోయారు.

కాశీకి వెళ్లొచ్చి ఏం ప్రయోజనం....

కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్లి వచ్చిన రెండు రోజులకే ఎంపీడీవో సంతోష్ రెడ్డి ఏసీబీకి చిక్కడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎంతో పుణ్యం వస్తుందని కాశీ యాత్రకు వెళ్లొస్తారు కానీ విశ్వేశ్వరున్ని దర్శించుకొని వచ్చినా... చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని, అందుకే ఆ దేవుడు కూడా కాపాడలేకపోయాడన్న వాదన వినిపిస్తోంది.

ఎంపీడీఓ గతమంతా వివాదాస్పదమే

ఇదివరకు ఇక్కడే సూపరింటెండెంట్ గా పనిచేసిన సమయంలో సైతం అతడి పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. కమ్మర్ పల్లి ఎంపీడీఓ గా పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చిన సంతోష్ రెడ్డి నెల రోజుల్లోనే ఏసీబీకి పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అధికారులపై ఏసీబీ నిఘా...?

సంతోష్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు రెండు మూడు గంటలు వెయిట్ చేసిన అధికారులు, తమ వద్ద ఉన్న ఫోటో ఆధారంగా ఈయన ఎంపీడీఓ నా అంటూ కార్యాలయానికి వచ్చేవారిని ప్రశ్నించారు. వివిధ శాఖల అధికారుల గురించి వివరాలు అడిగి తెలుసుకోగా ఫలానా అధికారి లంచాలు బాగా తీసుకుంటున్నాడని, కొన్ని శాఖలలో అయితే చెయ్యి తడపనిదే పనులు కావడం లేదని ఫిర్యాదులు బాగా రావడంతో ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా పలువురికి ఏసీబీ అధికారులు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story