Minister Jupalli : పారదర్శకపాలనే ప్రభుత్వ లక్ష్యం

by Kalyani |
Minister Jupalli : పారదర్శకపాలనే ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, భిక్కనూరు : ప్రజలకు పారదర్శకమైన ప్రజా పాలన అందించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కూడా పూర్తి కాకముందే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు బస్సు ఫ్రీ, 200 యూనిట్ల వరకు కరెంట్, 10 లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి హామీలను అమలు చేయడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రభుత్వంపై భారమైనప్పటికీ ఏ మాత్రం వెనకాడకుండా 31 వేల కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. శనివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన రుణమాఫీ సంబరాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుమారు 70 సంవత్సరాలు పాలించిన అన్ని ప్రభుత్వాలు 70 వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే, పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, వాటికి నెలకు 5 వేల కోట్లు నెలల చెల్లిస్తున్నామని, అధికారంలోకి వచ్చిన ఏడు నెలలలో 35 వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించడం జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకొని, లక్షల కోట్ల అప్పు చేసి కాంట్రాక్టర్లకు ధారపోశాడన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం అన్న చందంగా పరిపాలన సాగించి, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. బంగారు పళ్లెంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్ప జెప్పామని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, గొప్పగా పాలించి ఉంటే రాష్ట్ర ప్రజలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేదని మండిపడ్డారు.

ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చినమాటకు కట్టుబడి హామీలను అమలు చేస్తుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వంగా ప్రజలకు పాలన అందిస్తున్నామన్నారు. పాలనలో మార్పు తీసుకొస్తామని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వచ్చే ప్రతి ఒక్కరిని వారు గోచి కట్టుకొని వచ్చాడా అని నిర్లక్ష్యం చేయకుండా వారి వద్ద నుంచి ఫిర్యాదులు తీసుకొని, ఒక కాపీ జిరాక్స్ వారికి ఇచ్చి, అసలు దరఖాస్తును అధికారులు తీసుకోవాలని సూచించారు. సమస్య కరెక్ట్ అయితే పెండింగ్ లో ఉంచకుండా పనులు చేసి పెట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అనంతరం రైతుకు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటి మంత్రి నీళ్లు పోశాడు.

మాటకు కట్టుబడే చరిత్ర వాళ్ళది.... ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

గాంధీ కుటుంబం అంటే ఇచ్చిన మాటకు కట్టుబడే కుటుంబ చరిత్ర గాంధీ కుటుంబానిది అన్నారు. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రజలకు మాట ఇచ్చారంటే, అది ఖచ్చితంగా అమలు జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజలలో కలిగించారన్నారు. వారి చలువ వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, ఇప్పుడు ఆరు గ్యారెంటీలతోపాటు రుణమాఫీ అమలు జరుగుతుందన్నారు. అటువంటి గొప్ప చరిత్ర గాంధీ కుటుంబానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ సింధు శర్మ, డీఎఫ్ఓ నిఖిత, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, ఏ డి ఏ అపర్ణ, ఏ ఓ రాధ, తహసీల్దార్ కే శివప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భారీ బైక్ ర్యాలీ....

రుణమాఫీ సంబరాల్లో భాగంగా భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కురుస్తున్న వర్షానికి తడుస్తూ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ బైకు నడుపుకుంటూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed