ప్రజాపాలన సభలలో ప్రతి దరఖాస్తును స్వీకరించాలి

by Sridhar Babu |
ప్రజాపాలన సభలలో ప్రతి దరఖాస్తును స్వీకరించాలి
X

దిశ, ఆర్మూర్ : సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలలో ప్రజలు అందించే అన్ని రకాల దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఖుద్వాన్పూర్, వన్నెల్(కె), మచ్చర్ల, ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డులో కొనసాగుతున్న ప్రజా పాలన సభలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రజల సౌలభ్యం కోసం ఎన్ని కౌంటర్లను ఏర్పాటు చేశారు, దరఖాస్తులను అందుబాటులో ఉంచారా, దరఖాస్తులు నింపేందుకు వాలంటీర్లు, సిబ్బంది ప్రజలకు సహకారం అందిస్తున్నారా, తాగునీరు, నీడ, కూర్చునేందుకు కుర్చీలు వంటి తగిన

సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా వంటి అంశాలను పరిశీలించారు. ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని, ఎక్కువగా ప్రజలు ఏ పథకం కోసం దరఖాస్తు చేస్తున్నారనే వివరాల గురించి అధికారులను ఆరా తీశారు. దరఖాస్తు ఫారంలో నిర్దేశించిన వివిధ పథకాలతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా స్వీకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డులు, రెవెన్యూ సంబంధిత అంశాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు వంటి ఏ విషయంలోనైనా ప్రజలు ప్రజాపాలన సభలలో అధికారులకు అర్జీలు అందించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే ఐదు గ్యారెంటీలు కాకుండా ఇతర అంశాలపై వచ్చే దరఖాస్తుల వివరాలను ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా రసీదు అందించాలని, వారు ఏయే పథకాలకు దరఖాస్తు చేశారనే వివరాల వద్ద రసీదు ఫారంలో టిక్కులు పెట్టాలని తెలిపారు. దరఖాస్తులు అందించేందుకు వచ్చే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వారికి సంతృప్తికర స్థాయిలో సేవలందించాలని హితవు పలికారు. ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లాలో సాఫీగా నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, నోడల్ అధికారి జగన్నాథ చారి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story