రసవత్తరంగా మారిన ఆర్మూర్ రాజకీయం...

by Sumithra |
రసవత్తరంగా మారిన ఆర్మూర్ రాజకీయం...
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములలో యువత కీలక పాత్ర పోషించనుంది. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్, ఆర్మూర్, డొంకేశ్వర్, ఆలూర్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లో 217 పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 2,10,217 మంది ఓటర్లు ఉండగా, దాదాపు సగం వరకు 18 ఏళ్ల నుంచి 39 ఏళ్లు ఉన్న యువకుల ఓట్లే ఉన్నాయి. ఆర్మూర్ నియోజకవర్గ ఓటర్లలో 98,274 మంది పురుష ఓటర్లు కాగా, 1,11,937 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లు 1,04,502 మంది ఉన్నారు. గురువారం జరగనున్న ఆర్మూర్ అసెంబ్లీ 2023 ఎన్నికల్లో సుమారు 50 శాతం ఉన్నయువతీ, యువకులు, నిరుద్యోగులు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించనున్నారు.

ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ ముగ్గురు బలమైన అభ్యర్థులను బరిలో ఉంచడంతో ముగ్గురి మధ్య నువ్వా నేనా అన్నట్లు త్రిముఖ పోటీ ఆర్మూర్లో నెలకొంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల కోసం నిర్వహించిన ప్రచారాల్లో ప్రధాన ప్రతిపక్షాల పార్టీలు స్థానికత అంశాన్ని జనంలోకి విస్తృతంగా ప్రచారం నిర్వహించి, లోకల్ అయినా మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఏది ఏమైనా చురుకైన రాజకీయ చైతన్యం కలిగిన ఆర్మూర్ నియోజకవర్గ ఓటరు నాడి ఓ పట్టాన అంతు చిక్కలేదు. గురువారం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ అభ్యర్థికి ఓట్లేసి గెలిపిస్తారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వచ్చే నెల మూడవ తేదీన ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తీర్పు ఏ పార్టీ అభ్యర్థికి పట్టం కట్ట నున్నారో ఓటర్ నాడి ఫలితాల అనంతరం తెలియనుంది.

ఇదే తరహాలో బాల్కొండలో సైతం...

నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లు త్రిముఖ పోటీ నెలకొంది. బాల్కొండ నియోజకవర్గంలో 2,21,445 మంది ఓటర్లు ఉండగా 1,02,387 మంది పురుష ఓటర్లు కాగా, 1,19,056 మంది మహిళా ఓటర్లు ఉండగా, 02 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో సైతం మూడు ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లు గత రెండు నెలల నుంచి ప్రచారపర్వం కొనసాగగా, గురువారం బాల్కొండ నియోజకవర్గం ప్రజలు ఓటింగ్ లో పాల్గొని ఏ అభ్యర్థికి పట్టం కట్టనున్నారనే చర్చ తీవ్రంగా జరుగుతుంది. ఏది ఏమైనా వచ్చే నెల మూడో తేదీన ఏ అభ్యర్థికి బాల్కొండ ప్రజలు పట్టం కట్టారనే విషయం తెలియనుంది.

ప్రలోభాల పర్వం పట్టం కట్టించేనా..?

ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసి పోలింగ్ దశకు చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ప్రచార ఘట్టం ముగియడంతో ప్రలోభాల పర్వానికి తెరలేపినట్లు జోరుగా చర్చ జరుగుతుంది. గత రెండు నెలలుగా ప్రజలకు తామెంటో వివరించడానికి గ్రామ గ్రామాన విస్తృతంగా తిరిగి చెప్పుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార ఘట్టం ముగియడంతో ఎలాగైనా ఎమ్మెల్యే పదవులను అందుకోవాలన్న ఉద్దేశంతో బుధవారం సాయంత్రం నుంచి ప్రలోభాల పర్వానికి అభ్యర్థులు తెరలేపారు.

ఎన్నికల్లో నామినేషన్ పర్వం, ప్రచార పర్వాలు ముగియడంతో ప్రధానమైన పోల్ మేనేజ్మెంట్ ప్రక్రియ గురువారం జరగనుంది. దీంతో తమకే అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు ప్రజలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. బంగారం, చీరలు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, మాంసాలు, మద్యం, నగదు పంచడంలో అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతుండటంపై ఆర్మూర్, బాల్కొండ లలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ప్రచార పర్వం ముగియడంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి పట్టం కట్టించుకోవాలనే ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రయత్నాలకు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే విషయం వచ్చే నెల 3 న వెలువడే ఫలితాలతో తేటతెల్లం కానుంది.

Next Story

Most Viewed