కల్తీ కల్లు తాగి చనిపోతే పట్టించుకోరా...?

by Kalyani |
కల్తీ కల్లు తాగి చనిపోతే పట్టించుకోరా...?
X

దిశ, భిక్కనూరు : కల్తీ కల్లు తాగి చనిపోతే... ఆ కల్లు దుకాణం పై రైడ్ చేయడం చేతకాదు కాని, కల్తీ మద్యం తాగుతున్నారన్న తప్పుడు సమాచారం మేరకు దాబాలపై దాడులు చేసేందుకు వస్తారా...? అంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు నిలదీయడంతో ఎక్సైజ్ సిబ్బంది తోక ముడిచిన ఘటన భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో ఉన్న దాబాల వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సిద్ధ రామేశ్వర నగర్ సమీపంలో ఉన్న సుధాకర్ దాబా తో పాటు, శేఖర్ ఫ్యామిలీ రెస్టారెంట్లపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. అదే సమయంలో దాబాలో కూర్చొని భోజనం చేస్తున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొట్టి గిని శంకర్, లక్ష్మణ్ మాదిగ, డప్పు రవి, బాలరాజు లు ఎక్సైజ్ అధికారుల వద్దకు వెళ్లి విచ్చలవిడిగా కల్తీ కల్లు అమ్ముతున్నా పట్టించుకోని మీరు, కల్తీ మద్యం పేరుతో దాడులు చేసేందుకు వస్తారా అంటూ ప్రశ్నించారు.

కల్తీ కల్లు తాగి ఎంతోమంది అనారోగ్యం పాలై, మంచాన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కల్తీ కల్లు తాగి చనిపోతున్నా పట్టించుకోరా అంటూ...? ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్ షాపులపై దాడులు చేయడం సాధ్యం కాదు కాని, దాబాలపై దాడులు చేయడమేమిటని నిలదీశారు. ఇకనైనా కల్తీ కల్లును అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని హెచ్చరించారు. వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా తడబడుతూ వాహనమెక్కి అక్కడి నుంచి జారుకున్నారు.

దాబాలపై దాడులు...

ఎక్సైజ్ అధికారులు దాబాలపై దాడులు నిర్వహించారు. దోమకొండ ఎక్సైజ్ సీఐ మధుసూదన్ రావు ఆధ్వర్యంలోని ఎక్సైజ్ సిబ్బంది సర్కిల్ పరిధిలోని హైవే పై ఉన్న అన్ని దాబాలలో రైడింగ్ చేశారు.

Next Story

Most Viewed