కౌన్సిలర్ పేరున ఉన్న ఆల్కహాల్ ఫ్యాక్టరీ భూములు అప్పగించాలని ధర్నా

by Sridhar Babu |
కౌన్సిలర్ పేరున ఉన్న ఆల్కహాల్ ఫ్యాక్టరీ భూములు అప్పగించాలని ధర్నా
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డ్ కౌన్సిలర్ శంకర్ రావు టేక్రియాల్ శివారులోని ఆల్కహాల్ ఫ్యాక్టరీ భూములను తాను సర్పంచ్ గా పనిచేసిన సమయంలో తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, తిరిగి ఇప్పుడు గ్రామస్తులకు రిజిస్ట్రేషన్ చేసివ్వాలని కోరితే తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపిస్తూ గ్రామస్తులు ఊరడమ్మ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ...టేక్రియాల్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ఆల్కహాల్ ఫ్యాక్టరీ కి సంబంధించిన భూమిని ఓ ప్రైవేట్ కంపెనీ (భవాని ఇండస్ట్రీస్) అనే కంపెనీ కొనుగోలు చేసింది. గత కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామంలో ఫ్యాక్టరీ నడవడంతో

తమ గ్రామానికి కొంత భూమిని ఇవ్వాలంటూ గ్రామస్తులు కోరడంతో భవాని ఇండస్ట్రీస్ కు చెందిన కంపెనీ గ్రామంలోని అప్పటి 2007 సంవత్సరంలో గ్రామానికి చెందిన అప్పటి సర్పంచ్ శంకర్ రావు ప్రస్తుత కౌన్సిలర్, అప్పటి ఎంపీటీసీ సభ్యుడైన కుంటి ఆంజనేయులు పేరు మీద మూడు ఎకరాల భూమిని భవాని ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. తర్వాత కాల క్రమంగా ఆ భూమిని గ్రామంలోని నిరుపేదలైన బీడీ కార్మికులకు, మరికొంతమంది నిరుపేద వ్యక్తులకు 45 గజాల చొప్పున భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా మిగిలిన 1600 గజాల భూమిని శంకర్ రావు తన భార్య పేరుపై, ఎంపీటీసీ సభ్యుడైన కుంటి ఆంజనేయులు భార్య మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

దీనిపై గ్రామస్తులు గత పదిహేను సంవత్సరాలుగా గ్రామానికి చెందిన భూమిని గ్రామానికి ఇవ్వాలంటూ ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో హనుమాన్ ఆలయంను పునర్ నిర్మిస్తున్న సమయంలో గుడికి కొంత స్థలం అవసరం కావడంతో పక్కన ఉన్న భూమిని ఇవ్వడానికి మాజీ ఎంపీటీసీ కుంటి ఆంజనేయులు ఒప్పుకున్నప్పటికీ ప్రస్తుత కౌన్సిలర్ శంకర్ రావు ఇవ్వనంటూ మొండికేస్తున్నాడని, దీంతో గ్రామస్తులు ఆగ్రహించి గ్రామంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. శంకర్ రావుకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా

దౌర్జన్యాలకు పాల్పడుతూ తన భూమి ఇవ్వనంటూ, ఎవరికైనా ఫిర్యాదు చేసుకోమంటూ గ్రామస్తులపై మండి పడుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. అదే స్థలంలో మరికొంత భూమిని కబ్జా చేసి ఇల్లు కూడా నిర్మించుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి చెందిన భూమిని గ్రామస్తుల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story