మొబైల్‌ ఫోన్‌ ఆధారంగానే జరుగుతున్న సైబర్ నేరాలు..

by Sumithra |
మొబైల్‌ ఫోన్‌ ఆధారంగానే జరుగుతున్న సైబర్ నేరాలు..
X

దిశ, తాడ్వాయి : ఆన్‌లైన్‌, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీ పై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. కేవలం నిరక్ష్యరాస్యులే కాదు విద్యావంతులు సైతం ఈ మోసాలకు బలవుతున్నారు. ఇటీవల ఈ సైబర్‌ మోసాల బారినపడ్డ చాలామంది మండల పోలీస్‌స్టేషన్ ను ఆశ్రయించి వారి గోడు వెళ్ళగకున్న సందర్భాలు ఉన్నయి. అపరిచిత కాల్స్‌కు స్పందించినా, లింక్స్‌ క్లిక్‌ చేసినా మనం వారి ఉచ్చులో పడ్డట్టే. సైబర్‌ మోసాలు రకరకాలుగా జరుగుతున్నాయి. వయస్సు, వ్యక్తుల విధులను బట్టి కూడా నేరాలు జరుగుతున్నాయి. ఒకరు ఫోన్‌ చేసి ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలి లింక్‌ పంపిస్తున్నాం అంటూ మన ఖజానా ఖాళీ చేస్తారు. ఇంకొకరు ఓటీపీ అడిగి ముంచుతారు. ఇలాంటి సైబర్‌ మోసాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ నేరాలకు సంబంధించి కొన్ని మాత్రమే పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. మిగతా వారు పరువు పోతుందనో, చుట్టుపక్కల వారికి చులకన అవుతామనే ఉద్దేశంతో మోసపోయామని తెలిసినా ఎవరు చెప్పకుండా లోలోపల మదనపడేవారు కోకొల్లలు.

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పోగొట్టుకుంటున్న డబ్బులు..

మండలంలోని ఓ వ్యక్తికి చెందిన మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి ఆ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ ఆధారంగా కుటుంబ సభ్యులకు మిత్రులకు, ఫోన్ చేస్తూ నా దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు, డబ్బులు మీరు చెల్లిస్తారా లేదా అంటూ పలు మార్లు ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. మరో ఉద్యోగస్తుని ఖాతా నుంచి ఏకంగా రూ.2 లక్షలను సైబర్ నేరగాళ్ళు కాజేసినట్టు గ్రహించిన ఆ అధికారి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయినట్లు, ఈ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందేమో, చులకన అవుతుందేమో అని గోప్యంగా ఉంచారు. ఏ నెట్‌వర్క్‌ నంబర్‌ అనే వివరాలు కూడా చాలా మట్టుకు లభించవని, వారు వాడిన మొబైల్‌ నంబర్లను ట్రేస్‌ చేద్దామన్నా ఆనవాళ్లు సైతం దొరకవని పోలీసులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన రాష్ట్రాల్లోని వారే ముఠాలుగా ఏర్పడి ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలుపుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు సైతం సామాన్యులు, అమాయకులనే కాకుండా ఉద్యోగస్తులె టార్గెట్‌ చేసి మోసగిస్తున్నట్లు చెబుతున్నారు.

సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నంబర్ లేదా 100 ఫిర్యాదు చేయవచ్చు.

సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గ్రహించిన బాధితులెవరైనా ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు లేదా 100 ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. తక్షణం ఫిర్యాదు చేయడం ద్వారా సైబర్‌ నేరగాళ్లను ట్రేస్‌ చేయడం సులువవుతుందని, బాధితులు పోగొట్టుకున్న డబ్బును వెనక్కి రప్పించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఫిర్యాదుదారుడి ఫోన్‌ నంబర్‌, అకౌంట్‌ ఉన్న బ్యాంక్‌ పేరు, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌, మర్చండ్‌ ఐడీ, యూపీఐడీ నంబర్లు, లావాదేవీ జరిపిన ఐడీ, తేదీ, సమయం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ద్వారా లావాదేవీలు జరిపితే వాటి నంబర్లు, మోసానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లు వీటితో పోలీసులకు అందిస్తే త్వరితగతిన న్యాయం జరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్సై వెంకటేశ్వర్లు..

అపరిచితుల నుంచి వచ్చే ఆఫర్లు, లాటరీలు, డిస్కౌంట్లను నమ్మవద్దు. ఎవరూ ఊరికే మనకు బహుమతులు ఇవ్వరు. డబ్బులు పంపరు.. ఒక్క క్లిక్‌తో లోన్‌ ఇస్తామని నమ్మిస్తూ పలు యాప్‌లు లోన్లు ఇస్తాయి. లోన్‌ మొత్తానికి అధికంగా కట్టినా.. ఇంకా కట్టాల్సి ఉందని వేధిస్తాయి. ఇలా వేధింపులతో ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. అందుకే లోన్‌ యాప్‌లకు దూరంగ ఉండాలి. అనుమానాస్పదంగా ఉండే లింక్‌లు ఓపెన్‌ చేయకపోవడమే మంచిది. వాట్సాప్ గ్రూపులో ఇతర వాటీలో వివిధ నోటిఫికేషన్లు వస్తే వాటిని ఓపెన్‌ చెయ్యకపోవడమే మంచింది. డబ్బుల సంపాదనకు షార్ట్‌కట్‌ రూట్స్‌ ఉండవు. శ్రమించాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Next Story

Most Viewed