నిజామాబాద్‌లో మజ్లిస్ దోస్తీ కాంగ్రెస్ తోనే!

by Disha Web Desk 12 |
నిజామాబాద్‌లో మజ్లిస్ దోస్తీ కాంగ్రెస్ తోనే!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ ఏ పార్టీతో పొత్తు అనే అంశం ఖరారైంది. ఈ మేరకు దారుసలాం నుంచి మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని ప్రకటించినట్లు నిజామాబాద్ ఇన్ చార్జి, భైంసా మున్సిపల్ చైర్మన్ జాబిర్ హుస్సేన్ ప్రకటించారు. ఈ మేరకు మజ్లిస్ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో దేశవ్యాప్తంగా మోడీని గద్దె దించేందుకు ఇండియా కూటమితో మజ్లిస్ పార్టీతో కలిసి పని చేయాలని నిర్ణయించిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మజ్లిస్ కార్యకర్తలు కాంగ్రెస్ పక్షాన పని చేయాలని తీర్మానించారు. జిల్లాలో ప్రధాన పక్షాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తర్వాత మజ్లిస్ పార్టీ బలంగా ఉంది. 2014 నుంచి ఆ పార్టీ బీఆర్ఎస్ తో దోస్తానా కొనసాగింది.

రెండు పర్యాయాలు నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు బల్దియా ఎన్నికల్లో పరస్పర సహకారాన్ని అందించుకున్నాయి. గత దశాబ్ద కాలంగా నిజామాబాద్ డిప్యూటీ మేయర్ గా మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా దక్కించుకుంటూ వస్తుంది. ఆ పార్టీకి నిజామాబాద్ లో 16 మంది కార్పొరేటర్లు, బోధన్ లో 8 మంది కౌన్సిలర్లు, ఆర్మూర్ లో ఒక కౌన్సిలర్ ఉండగా జగిత్యాల లోనూ కౌన్సిలర్లు ఉన్నారు. బల్దియా ఎన్నికల్లో కచ్చితంగా మజ్లిస్ పార్టీ మద్దతు ఉన్నవారికే నిజామాబాద్ అర్బన్ తో పాటు బోధన్ లాంటి పెద్ద పట్టణంలో మేయర్, చైర్మన్ పదవులు దక్కే పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పతంగి పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేశాయి. బీఆర్ఎస్ ఎంపీ క్యాండెట్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే వారితో ఒక దఫా చర్చలు కూడా జరిపారు.

కాంగ్రెస్ క్యాండెట్ జీవన్ రెడ్డి కూడా మజ్లిస్ మద్దతు కావాలని ప్రయత్నించారు. ఎందుకంటే నిజామాబాద్ గడ్డను బీజేపీ అడ్డా కాకుండా చేయాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మజ్లిస్ పార్టీ మద్దతు తప్పనిసరి. నిజామాబాద్ నగరంలోని దాదాపు లక్షకు పైగా మైనార్టీ ఓటర్లున్నారు. బోధన్ లో అదే పరిస్థితి ఉంది. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండలోనూ అదే స్థాయిలో ఓటర్లున్నారు. జగిత్యాల్ లో కూడా మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి మజ్లిస్ పార్టీ పొత్తు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తీవ్రంగానే కసరత్తు చేశాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ నామినేషన్లు దాఖలు చేయకుండా హైదరాబాద్ కే పరిమితమైన విషయం తెల్సిందే. ఆ పార్టీ అధినేత ఆదేశాల కోసం అక్కడ క్యాడర్ అంతా ఎదురు చూస్తుంది. పార్లమెంటు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇండియా కూటమిలో మజ్లిస్ పార్టీ చేరకపోవడంతో ఆ పార్టీ మద్దతు ఎవ్వరికనే చర్చ జరిగింది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యధికంగా ముస్లింలు ప్రభావశీలురుగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది నిజామాబాద్ స్థానం.

అందుకే ప్రధానంగా బీజేపీ వ్యతిరేక పార్టీలైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మజ్లిస్ పొత్తు కోసం తహతహలాడాయి. గత ఐదు సంవత్సరాల కాలంలో బీజేపీ తీసుకువచ్చిన కొన్ని చట్టాలతో ముస్లీంలు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. దాన్ని సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఆ పార్టీ మద్దతు కోసం చేయని ప్రయత్నం లేదు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పై అసదుద్దీన్ జరిపిన చర్చలు ఫలించి మజ్లిస్ పార్టీ తాను పోటీ చేయని ప్రాంతాల్లో కాంగ్రెస్ కే మద్దతు ఇవ్వాలని తీర్మానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు మజ్లిస్ పార్టీ గులాబీ కండువా కప్పుకోగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం చేయి గుర్తు పార్టీకి అభయహస్తం అందించినట్లయింది. దీంతో ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అసలే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో నుంచి క్యాడర్, లీడర్లు వలస పోగ మజ్లిస్ పొత్తు కూడా దక్కకపోవడం పెద్ద దెబ్బగా చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ కాంగ్రెస్ పార్టీ పొత్తు ప్రభావం చూపుతుందా లేదా అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed