నిజామాబాద్‌‌లో కొకైన్ కలకలం..ఇద్దరు అరెస్ట్

by Aamani |
నిజామాబాద్‌‌లో కొకైన్ కలకలం..ఇద్దరు అరెస్ట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో తొలిసారి కోకైన్ తో పాటు ఎండీఎంఏ లాంటి మత్తు పదార్థాలు పోలీసులకు చిక్కాయి. ప్రధానంగా మెట్రోపాలిటన్ ప్రాంతాలకు పరిమితమైన డ్రగ్స్ నిజామాబాద్ లో పట్టుబడడం కలకలం రేపింది. సోమవారం నిజామాబాద్ డిప్యూటీ పోలీసు కమిషనర్ జయరాం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 31న నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం నడిపల్లి తండా వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందిన ద్వారంపూడి విక్రమ్, పల్నాడు జిల్లా చిలుకలూరి పేట మండల కేంద్రానికి చెందిన షేక్ ఖాజా మొయినుద్దీన్ అనే యువకులు కారులో ప్రయాణిస్తుండగా తనిఖీలు చేశారు. వారి వద్ద కారు డాష్ బోర్డులో 3 ప్లాస్టిక్ పాలితిన్ తెల్లటి కవర్లు వుండి మరొక ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్లో తెల్లని కోన్ ఆకారంలో గల ముక్క ,డిక్కీలో మూలకు మరో చిన్న ప్యాకెట్ లు ఉన్నాయి. వాటిని క్లూస్ టీం సిబ్బంది పరిశీలించి చూడగా 3 ప్లాస్టిక్ పాలితిన్ తెల్లటి కవర్ల యందు ఉన్నదానిని ఎండీఎంఏ అనే డ్రగ్ , మరొక ప్యాకెట్ యందు కోను ఆకారంలో ఉన్న తెల్లటి ముద్దను కొకైన్ గా గుర్తించారు.

అలాగే కారు వెనుక భాగంలో దొరికిన ప్యాకెట్ యందు గoజా పొడిగా గుర్తించడం జరిగింది. వాటిని బరువు తూయగా ఎండీఎంఏ డ్రగ్ 3.2 గ్రాములుగా, కొకైన్ ను 12.3 గ్రాములుగా, గంజా పౌడర్ 3.1 గ్రాములుగా ఉంది. ఇవన్నీ కూడా ఇద్దరు ఢిల్లీకి చెందిన రాహుల్ అనే వ్యక్తి ద్వారా ఢిల్లీ లోని మైక్ అనే వ్యక్తి నుండి తీసుకుని న్యూ ఇయర్ కోసం అతని స్నేహితులతో కలిసి తీసుకుందాం అని కారులో తెచ్చుకుంటున్నారని తెలుపగా, వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు డీసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి స్కోడా కారు, మత్తు పదార్థాలు, సెల్ ఫోన్లు సీజ్ చేశారు. పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు తొలిసారి జిల్లాలో డ్రగ్స్ పట్టుకోవడంలో నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు, ఇన్స్పెక్టర్లు అజయ్ బాబు, అంజయ్యతో పాటు వారి సిబ్బంది డిచ్పల్లి సిఐ కె.కృష్ణ, ,ఎస్. ఐ మహేష్ , సిబ్బంధి రాము, సతీష్ , రాజేశ్వర్ , సర్దార్ , సందీప్, సుధాకర్ లను అడిషనల్ డీసీపీ జయరాం అభినందించారు.

Advertisement

Next Story