cyber crime : విద్యార్థులకు సైబర్ నేరాల పై అవగాహన...

by Sumithra |
cyber crime : విద్యార్థులకు సైబర్ నేరాల పై అవగాహన...
X

దిశ, నిజాంసాగర్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీస్ ఫోరం స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్. దయానంద్ ఆధ్వర్యంలో టెలిఫోన్, సెల్ ఫోన్ వినియోగం గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిందని అన్నారు. ప్రతినిమిషం సెల్ ఫోన్ లేనిది ఏ పని చేయలేకపోతున్నామని, ప్రతిదీ కూడా సెల్ ఫోన్ తోనే లింక్ ఉండడంతో మన సెల్ ఫోన్ నెంబర్ కూడా మన బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, పెన్షన్, పౌరసరఫరాల వినియోగానికి సంబంధించి అన్ని విధాలుగా మన సెల్ ఫోన్ నెంబర్ అవసరం ఉంటుందని అన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. సైబర్ నేరాల పట్ల, ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు డ్రగ్స్ వంటి తదితర అంశాల పై యువత, విద్యార్థునులకు పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో మహిళలు పిల్లలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. యువత ఇంటర్నెట్ పరిమితికి మించి వాడకూడదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారని అన్నారు.

గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్‌ చేసి మీ ఏటీఎం, పిన్‌నెంబర్‌, సీవీవీ, బ్యాంకు ఖాతా తదితర వివరాలు కోరితే ఇవ్వరాదన్నారు. ఎవరైనా మీకు లాటరీ తగిలింది, కొంత డబ్బును సూచించిన బ్యాంకు ఖాతాలో జమచేయాలని ఫోన్‌ కాల్‌ వచ్చినా, ఏ విధంగా అయినా మీరు మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బును కోల్పోతే వెంటనే సమీప పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి ఆపద సమయంలో సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి లేదా 100 లకు ఫోన్ చేసి పోలీసులకు, ఇతర శాఖల యంత్రాంగం సేవలు పొందాలని ఆయన కోరారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తును తీర్చిదిద్దు కొనాలని, ఉన్నత ఉద్యోగాలు సాధించాలని మహిళలపై చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీస్ ఫోరం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్. దయానంద్ సీఈవో బండారు అశోక్ వర్ధన్, సంస్థ మేనేజర్, ప్రియాంక,సీనియర్ అధికారి షకీరా,సంస్థ సిబ్బంది మహమ్మద్ అజారుద్దీన్, ప్రధానోపాధ్యాయులు రామ్ చందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, రక్షణ్ కాంత్, షాదుల్లా, ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story