- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాలి నొప్పితో విలవిల్లాడుతున్న బాధితుడు

దిశ, కామారెడ్డి :కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓ గర్భిణికి డెలివరీ చేయలేమంటూ నిజామాబాద్ రిఫర్ చేయగా మధ్యలోనే అంబులెన్స్ సిబ్బంది డెలివరీ చేసిన ఘటన మరువకముందే మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పేషంట్ ఆస్పత్రిలో చేరి 15 రోజులైనా ఆపరేషన్ గురించి పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోయాడు. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన ఊరకమ్మరి కిష్టయ్య గత నెల 30 న ఆస్పత్రిలో చేరాడు. రెండు నెలల క్రితం కిష్టయ్యకు విద్యుత్ షాక్ తగిలి కాలికి తీవ్ర గాయమైంది. కాలు పాదం వద్ద సగానికి పైగా మాంసం పోయి ఇన్ఫెక్షన్ అవుతోంది. అయితే కాలికి మాంసం తిరిగి వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో ఆరికాలు నుంచి పైన కొంతభాగం వరకు తొలగించుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ప్రైవేటులో ఖర్చు చేసి స్థోమత లేక జిల్లా ఆస్పత్రిలో చేరగా వైద్యులు ఆరోగ్యశ్రీ కింద అప్లై చేయగా ఆపరేషన్ కు అప్రూవల్ కూడా వచ్చింది. అయితే బోన్ కటింగ్ మిషన్ లేదని, ఆర్డర్ పెట్టామని వారం రోజుల్లో వస్తుందని వైద్యులు చెప్పారు. దాంతో కిష్టయ్య ఆస్పత్రిలోనే ఉన్నాడు. కాలికి రోజు డ్రెస్సింగ్ చేయకపోతే కుళ్ళిపోయే ప్రమాదం ఉండటంతో ఆస్పత్రి నర్సులు డ్రెస్సింగ్ చేస్తున్నారు. మిషన్ కోసం ఆర్డర్ పెట్టి 10 రోజులకు పైగా అవుతున్నా..ఇంకా వారం పడుతుందంటూ వైద్యులు తాత్సారం చేస్తున్నారు. మరోవైపు ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రంతా కాలి నొప్పి భరించలేక కిష్టయ్య విలవిల్లాడుతున్నాడు. శుక్రవారం ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పినా ఆపరేషన్ చేసే వైద్యుని వేలికి గాయమైందని నాలుగైదు రోజుల తర్వాత చేస్తామని చెప్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. శనివారం తనకు ఆపరేషన్ చేయకపోతే కాలు నొప్పితో ప్రాణం పోయినా ఇంటికి వెళ్లిపోతానని విలపిస్తున్నాడు. తన వద్ద ఉన్న డబ్బుతో పాటు అప్పు తెచ్చి చనిపోయే పరిస్థితిలో ఉన్న తన భర్తను కాపాడుకున్నానని, ప్రస్తుతం ఆర్థిక స్థోమత లేక ఇక్కడికి వస్తే పట్టించుకోవడం లేదని కిష్టయ్య భార్య శ్యామల చెప్తోంది. ఆపరేషన్ చేసి కాలు తొలగించి నొప్పి నుంచి విముక్తి కల్పించాలని భార్యభార్తలు వేడుకుంటున్నారు.