మూడు కోట్ల ప్రాపర్టీ పై కొత్త ట్విస్ట్..

by Sumithra |
మూడు కోట్ల ప్రాపర్టీ పై కొత్త ట్విస్ట్..
X

దిశ, భిక్కనూరు : హైవేను ఆనుకొని, పాత రహదారి పక్కన అప్పట్లో గ్రామ అభివృద్ధి కమిటీ కొనుగోలు చేసిన స్థలం పై జంగ్ మొదలైన నేపథ్యంలో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఒకరిద్దరు ఖద్దర్ నేతలు ఆ ప్రాపర్టీని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న పట్టుతో భారీ స్కెచ్ వేశారు. అసలు పట్టాదారునికి తెలియకుండా బినామీతో ముందుగా ఒప్పందం కుదుర్చుకొని, అన్ని మేమే చూసుకుంటాం అంటూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అనంతరం పథకం ప్రకారం పట్టాదారుని పేరిట ఉన్న ఆరు గుంటల భూమికి బదులుగా 16 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ విషయమై ఊరు ఊరంతా కోడై కూస్తోంది.

భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే అవతలి దారిలో 1019 సర్వేనంబర్ లో 30 సంవత్సరాల క్రితం గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం గ్రామస్తుల విరాళాలతో 10 గుంటల భూమిని కొనుగోలు చేసి పెట్టింది. అయితే ఆ భూమికి సంబంధించిన పత్రాల ఫైల్ గ్రామపంచాయతీలో భద్రంగా ఉంచారు. గ్రామ పంచాయతీ భవనం పునర్నిర్మించిన సమయంలో ఆ ఫైల్ మాయమైందన్న ప్రచారం చర్చకు తెరలేపింది. ముందు చూపుతోనే కొందరు నేతలు ఫైల్ ను మాయం చేసి ఉంటారన్న గుసగుసలు పట్టణంలో వినిపిస్తున్నాయి. ఫైల్ మాయం చేయించడం ద్వారా, తాము ముందుగా అనుకున్నట్లు బినామీతో 6 గుంటల భూమికి బదులు, వీడీసీ కొనుగోలు చేసిన 10 గుంటల భూమి కలిసొస్తుందన్న ఉద్దేశంతోనే పలుకుబడిని ఉపయోగించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించారన్న ప్రచారం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అప్పట్లో 6.5 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన ఆరు గుంటల భూమితో పాటు వీడీసీ కొనుగోలు చేసిన 10 గుంటల భూమిని కలిపి 16 గుంటలకు సంబంధించి అప్పట్లో ఇక్కడ పనిచేసిన కొంతమంది రెవెన్యూ సిబ్బంది అండతో, తప్పుడు పత్రాలు సృష్టించి, సాదా బైనమాలో రిజిస్ట్రేషన్ చేయించినట్లు" దిశ "కు దొరికిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే వీరికి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన బినామీని మాత్రం అసలు పట్టాదారులు తమ పేరిట ఉన్న మొత్తం భూమిని, వారి పేరిట ఎలా చేసిచ్చావంటూ ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. దీంతో సదరు బినామీ ఏమి చేయాలో పాలుపోక పరేషాన్ లో పడినట్టు తెలుస్తోంది. సీన్ మొత్తానికి రివర్స్ అయి తన పైకి వస్తే మాత్రం, తనతో ఈ పనిచేయించిన ఖద్దర్ నేతల పేర్లు సమయం వచ్చినప్పుడు బయట పెడతానని అన్నట్లు అసలు పట్టాదారులు చెబుతున్న విషయం.

Advertisement

Next Story

Most Viewed