హామీలకు 12 ఏళ్లు...అయినా నెరవేరలేదు

by Sridhar Babu |
హామీలకు 12 ఏళ్లు...అయినా నెరవేరలేదు
X

దిశ, గాంధారి : స్వయానా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు వచ్చి పరిశీలించాక తమ బతుకు మారుతుందని ఆశించిన గ్రామస్తులకు 12 ఏళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలుగా ఉన్న అప్పటి కాలంలో జరిగిన అగ్నిప్రమాదం ప్రాణ, ఆస్తి నష్టంలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే మంత్రులు, పార్లమెంట్ సభ్యుడు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, అదనపు జిల్లా కలెక్టర్లు ఆ గ్రామానికి వెళ్లి సందర్శించి నష్టపోయిన ప్రతి ఒక్క బాధితునికి పక్కా ఇల్లు కట్టిస్తాం,

తగిన నష్టపరిహారం అందించేలా చూస్తామని చెప్పిన మాటలన్నీ నీటిమూటలయ్యాయి. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో 2012 మార్చి 24వ తేదీన భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక వార్డులో గాలి దుమారం తోడై సగం గ్రామంలోని గుడిసెలను, పెంకుటిళ్లను పాక్షికంగా ధ్వంసం చేసింది. దాదాపు 50 ఇండ్లకు పైగా అగ్నికి ఆహుతై నేటికి సరిగ్గా 12 ఏళ్లు గడుస్తుంది. అప్పటికే ఇద్దరు కాలిపోయి ఒకరు చికిత్స పొందుతూ రెండు మూడు రోజుల వ్యాధిలోనే చనిపోయారు. గొర్రెలు, మేకలు చాలానే మృత్యువాత పడ్డాయి.

సందర్శించిన అప్పటి మంత్రి, ఎంపీ

అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రి సుదర్శన్ రెడ్డి మొదట గ్రామాన్ని సందర్శించి నష్టపోయిన బాధితులందరికీ ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టిస్తామని, అంతేకాకుండా ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి 12 ఏళ్లు గడిచినా పక్కా ఇల్లు కాదు కదా కనీసం నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు కూడా లేవు.

నెలరోజులపాటు అధికారులు నాయకుల హడావిడి.....

అప్పటి ఉర్దూ అక్కడమీ వర్క్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ షబ్బీర్ అలీ, జెడ్పీ చైర్మన్ కాటేపల్లి వెంకటరమణారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, అధికారులు,నాయకులు, ప్రతిపక్ష నేతలు నెల రోజుల పాటు నిర్విరామంగా హడావిడి చేశారు. దాంతో ఊరు ఏమైనా అభివృద్ధి చెందుతుందేమోనని భావించారు. కానీ చివరికి బాధిత కుటుంబాలకు కూడా ఏమీ లబ్ధి చేకూరలేదు.

దాతలు ఎందరో ముందుకు....

అగ్నికి ఆహుతైన ఇల్లు మొత్తం నష్టపోయిన బాధితులందరికీ నిజామాబాద్, బాన్సువాడ, కామారెడ్డి, గాంధారి నుంచి ఎంతో మంది వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల వారు రగ్గులు, దుప్పట్లు, బియ్యం, వంట సామాగ్రి పంపిణీ చేశారు. గాంధారి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ దాదాపు ఇల్లు కాలిపోయిన బాధితులకు దాదాపు 150 రేకులను సహాయం చేశారు.

డబుల్ బెడ్ రూంలో కూడా పక్షపాతమే : మాజీ సర్పంచ్ మోహన్

పాక్షికంగా దెబ్బతిన్న వారికి కూడా డబుల్ బెడ్ రూములు ఇచ్చారని, పూర్తిగా దెబ్బతిన్న వారికి డబుల్ బెడ్రూంలు ఇవ్వలేదని మాజీ సర్పంచ్ మోహన్ అన్నారు.

Advertisement

Next Story