వరకట్నం కోసం వేధించిన భర్త, అత్తకు ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష..

by Sumithra |   ( Updated:2024-10-04 17:19:41.0  )
వరకట్నం కోసం వేధించిన భర్త, అత్తకు ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష..
X

దిశ, కామారెడ్డి : ఓ మహిళను వరకట్నం కోసం వేధించి ఆమె చావుకు కారణమైన భర్తతో పాటు అత్తకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. భిక్కనూర్ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన లావణ్య, రామేశ్వరపల్లికి చెందిన మల్లాని గణేష్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లావణ్య కుటుంబ సభ్యులకు పెళ్లి ఇష్టం లేకపోయినప్పటికీ అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. అయితే లావణ్యకు పాప పుట్టి చనిపోయింది. ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్న లావణ్యను భర్త గణేష్, అతని తల్లి ఎల్లవ్వలు అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలకు గురి చేశారు.

ఈ విషయంలో లావణ్య సోదరుడు రామస్వామి పలుమార్లు తన బావ, అత్తకు సర్దిచెప్పి కట్నం ఇస్తానని ఒప్పించినా వేధించడం మాత్రం మానలేదు. దాంతో బాధలు భరించలేక లావణ్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం పై లావణ్య సోదరుడు రామస్వామి ఫిర్యాదు మేరకు ఆనాటి భిక్కనూర్ ఎస్సై రాజు, డీఎస్పీ ప్రసన్నరాణిలు విచారణ జరిపి గణేష్, ఎల్లవ్వలను అరెస్టు చేసిరిమాండ్ కు తరలించారు. ఈ కేసులో శుక్రవారం జిల్లా న్యాయమూర్తి డా.వరప్రసాద్ తన తీర్పులో ఇద్దరు నిందితులు అయిన గణేష్, ఎల్లవ్వలకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. కాగా వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed