విద్యార్థి విభాగం కొత్త కమిటీ వేయడానికి జంకుతున్న బీఆర్ఎస్.. కారణమిదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-20 05:48:39.0  )
విద్యార్థి విభాగం కొత్త కమిటీ వేయడానికి జంకుతున్న బీఆర్ఎస్.. కారణమిదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ వేయడానికి బీఆర్ఎస్ అధిష్టానం జంకుతుంది. విద్యార్థుల్లో ప్రభుత్వం వ్యతిరేక ఎక్కువ అవుతుండడంతో ఎన్నికల ముందు కమిటీ వద్దని, వాయిదా వేయడమే మంచిదని భావిస్తుంది. ఒకవైపు పోటీ పరీక్షల పేపర్లు లీకేజీ.. మరో వైపు విద్యార్థుల్లో పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు... ఇంకోవైపు టెన్త్ పరీక్షల పేపర్లు సైతం లీకేజ్ అవుతుండడంతో విద్యార్థి నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ తరుణంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు సైతం యూనివర్సిటీలకు వెళ్లడానికే జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీని నియమిస్తే... విద్యార్థుల్లోకి చొచ్చుకెళ్లే నాయకుడెవరు... విద్యార్థుల్లో వ్యతిరేకత నేపథ్యంలో ఆశ జనక ఫలితాలు వస్తాయా? ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకోవడానికి నాయకుడు ఉన్నారా? అనే అంశాలను పార్టీ అధిష్టానం సుధీర్ఘంగా పలువురితో చర్చించినట్లు సమాచారం. అందుకే రాష్ట్ర కమిటీ వాయిదా వేయడమే మంచిదని భావనకు వచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం.

అన్ని పార్టీలకు విద్యార్ధి విభాగమే కీలకం. ఏ ఉద్యమం నడిపించాలన్న... ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చాలన్న విద్యార్థులే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి రాష్ట్ర కమిటీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వేయవద్దని భావిస్తుంది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆయన వివాదా రహితుడుగా ఉండడంతో ఆయననే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తే ఎన్నికల ముందు ఇబ్బందులు తలెత్తుతాయని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అందుకే రాష్ట్ర కమిటీ కాకుండా కేవలం జిల్లా కమిటీలు, నియోజకవర్గ, మండల కమిటీలు వేయాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఈ కమిటీలతోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రణాళిక రూపొందిస్తుంది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను సైతం వివరించే ప్రయత్నాలను చేస్తున్నట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈనెల 27 తర్వాత బీఆర్ఎస్వీకి విధివిధానాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. విద్యార్ధి, నిరుద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న క్రమంలో బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని బిఆర్ఎస్వి శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story