కొండా సురేఖపై అనుచిత పోస్టులు.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

by M.Rajitha |
కొండా సురేఖపై అనుచిత పోస్టులు.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ భవన్ వద్ద నేడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం ఒక్కసారిగా తెలంగాణ భవన్ వద్దకు కాంగ్రెస్ చేనేత విభాగం నాయకులు వచ్చి, బీఆర్ఎస్ ప్రధాన గేటువద్ద బీఆర్ఎస్ సోషల్ మీడియా దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువురు మధ్య తోపులాట జరిగింది. దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు లాక్కొన్ని దానిని విచ్చిన్నం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులపై దాడి చేశారు. కేటీఆర్ వస్తున్నారనే సమాచారంతో భారీగా కార్యకర్తలు తెలంగాణ భవన్ కు వచ్చారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మంత్రి సురేఖ పై అనుచిత పోస్టులు పెట్టడ్డం దారుణమన్నారు. అక్కలాగా సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్తే... ఎంపీ రఘునందన్ రావు నూలు దండ మెడలో వేస్తే... దానికి తప్పు ఉందా? ఆ ఫొటోను పోస్టు చేసి కల్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తారని ట్రోలింగ్ చేయడం దుర్మార్గం అన్నారు. బేషరతుగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బిడ్డల క్షేమం కోసం కొట్లాడాలని సూచించారు. గూండాలను పెట్టించి కొట్టిస్తారా? అని ప్రశ్నించారు. ఒక మహిళ మంత్రిని అవమానిస్తారా? అని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ గూండా రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డలు ఓటు వేయకుండా బీఆర్ఎస్ కు బుద్దిచెప్పారని, అయినా తీరుమారలేదన్నారు. మొన్న కౌశిక్ రెడ్డి చీర గాజులు పెట్టి మహిళల మనోభావాలు దెబ్బతినేలా చేసాడు... నేడు ఆ పార్టీ సోషల్ మీడియా ఇలా మహిళా మంత్రిని ట్రోల్ చేస్తున్నారని, ఇదేనా బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం అని డిమాండ్ చేశారు. కేటీఆర్ దీనిపై స్పందించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురు అక్కడి నుంచి పంపించివేశారు.

Advertisement

Next Story

Most Viewed