ఆస్పత్రి నుంచి పసికందును ఎత్తుకెళ్లిన దుండగులు.. ఛేజ్ చేసి పట్టుకున్న హోంగార్డు

by Nagam Mallesh |
ఆస్పత్రి నుంచి పసికందును ఎత్తుకెళ్లిన దుండగులు.. ఛేజ్ చేసి పట్టుకున్న హోంగార్డు
X

దిశ, సూర్యాపేట : దుండగులు దారుణానికి తెగబడ్డారు. ఏకంగా జిల్లా ఆస్ప్రతిలో తల్లి పక్కలో నుంచి పసికందును ఇద్దరు దుర్మార్గులు శుక్రవారం ఉదయం ఎత్తుకెళ్లారు. తల్లి నిద్ర లేచేసమయానికి బాబు పక్కన లేకపోవడంతో ఆమె పక్కనున్న వారికి చెప్పింది. దీంతో ఈ విషయం బయటకు పొక్కింది. కాగా ఇద్దరు దుండగులు నెంబర్ ప్లేట్ లేని బైక్ మీద బాబును ఎత్తుకెళ్తుండగా ఇదే సమయంలో స్థానిక తెలంగాణ విగ్రహం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ హోం గార్డు అనుమానం వచ్చి ఆ బైక్ ని ఆపడంతో ఆపకుండానే పరారయ్యారు. దీంతో కొందరు వ్యక్తుల సాయంతో ఆ హోంగార్డు వారి వెంట పడండంతో వెనుక వైపు కూర్చున్న వ్యక్తిని కొత్త బస్టాండ్ వద్ద దింపి బైక్ నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. అయితే అతను అవతలి బజారు వైపు పసికందును తీసుకెళ్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు తిట్టిపోశారు. బాబుని తల్లికి అప్పగించాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అసలు బాబుని ఎందుకు తీసుకొచ్చావు...? ఎవరు నీవు..? నీకు బాబుకి సంబంధం ఏంటని ప్రశ్నించగా అతను పొంతన లేని సమాధానాలు చెపుతూ దాట వేశాడు. ఇంతలో హోంగార్డు అతని వద్దకు వచ్చి అసలు ఈ బాబును ఎక్కడి నుంచి తెచ్చావంటూ మందలించడంతో.. ఆ బాబు తన మేనల్లుడు అని చెప్పాడు. బైక్ మీద వచ్చిన మరో వ్యక్తి తన బావ అని.. బాబుకు తండ్రి అవుతాడంటూ నమ్మబలికాడు. బాబుకు జ్వరం రావడంతో కవిసాగర్ ఆసుపత్రికి తీలుకెళ్ళేందుకు వచ్చామని చెప్పాడు. మా చెల్లిది పెన్ పహాడ్ మండలంలోని జల్మల్ కుంట తండా అని చెప్తున్నాడు.

అంతే కాకుండా.. రాత్రి ఏరియా ఆసుపత్రిలో నేను పడుకుంటే తన రూ.30 వేల సెల్ పోతే పోలీసులు దాన్ని ఎందుకు ఇంత వరకు పట్టుకోలేదని పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. బాబుని బయటకు తీసుకొస్తే మమ్మల్ని మాత్రం ఎందుకు పట్టుకుంటారని పొంతన లేకుండా ఎదురు ప్రశ్నిస్తున్నాడు. మీది ఏ ప్రాంతం అని అడిగితే మోతే మండలం సిరికొండ సమీపంలోని లాల్ తండా వాసిగా చెప్తున్నాడు. బాబును తల్లికి అప్పజెప్పాలంటూ స్థానికులు ఆగ్రహానికి రావడంతో.. అతన్ని తీసుకుని ఆస్పత్రికి బయలుదేరాడు హోంగార్డు. అయితే అతను చెప్తున్న దాంట్లో ఎంత వరకు నిజం ఉంది.. లేదంటే ఎత్తుకొచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story