మతసామరస్యానికి వేదిక 'కొత్తగూడెం నియోజకవర్గం' : కూనంనేని సాంబశివరావు

by Aamani |
మతసామరస్యానికి వేదిక కొత్తగూడెం నియోజకవర్గం : కూనంనేని సాంబశివరావు
X

దిశ,కొత్తగూడెం : అనాది నుంచి మతసామరస్యానికి వేదికగా, ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా కొత్తగూడెం నియోజకవర్గం నిలుస్తోందని, పండుగలన్నీ కులమతాలకతీతంగా జరుపుకుంటూ ఐక్యతను చాటడం హర్షణీయమని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పవిత్ర రంజాన్ పండుగను సందర్భంగా సోమవారం బొడగుట్ట ఈద్గాలను సందర్శించి రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ భిన్న మతాలు, విభినన్న కులాల సమ్మేళనమే భారత దేశమని, అందరం కలిసుంటేనే సమాజంలో శాంతి నెలకొంటుందని, దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు.

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం కుటుంబాలు ఆచరించే ఫిత్రా, జకార్త్ వంటి నియమాలు పేద వాడి ఆకలిని, శ్రమను గుర్తించే ఏర్పాటు చేసుకున్నవేనని, సంపాదనలో కొంత భాగాన్ని పేదల ఆకలితీర్చేందుకు కేటాయించడం మహోన్నతమైనది, మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆచరిస్తే సమాజంలో శాంతి ఆవిష్కృతమవుతుందన్నారు. ముస్లింలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాసే కుట్రలకు కేంద్రం పాల్పడుతోందని, అందులో భాగంగానే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తెచ్చేందుకు పూనుకుందన్నారు.

రంజాన్ మాసంలో ఈ బిల్లును తెరపైకి తెచ్చి ముస్లిం కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తోందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఉర్దూఘర్ చైర్మన్ నయీమ్ ఖురేషి, ఈద్గాల అధ్యక్షుడు ఫారూఖ్ ఏస్ధాని, డీఎస్పీ రెహమాన్, అబీద్ హుస్సేన్, జహంగీర్ షరీఫ్, రబ్ సహాబ్, యూసుఫ్, జావీద్ సాటే, బాసిత్, ఖాద్రి, యాకుబ్, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, సిపిఐ నాయకులు కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, ధర్మరాజు, బోయిన విజయ్ కుమార్, నేరెళ్ల శ్రీనివాస్, పి సత్యనారాయణ చారి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed