భూమి ఒకరిది..మరొకరికి పట్టా.. అక్రమంగా భూ రిజిస్ట్రేషన్

by Aamani |
భూమి ఒకరిది..మరొకరికి పట్టా.. అక్రమంగా భూ రిజిస్ట్రేషన్
X

దిశ ,నల్లగొండ బ్యూరో: నా ఇష్టం వచ్చినట్లు పట్టా మార్పిడి చేస్తా... దిక్కున్న చోట చెప్పుకో... కోర్టుకు వెళ్తావా నా పేరు తోనే వెళ్ళు.. నన్ను ఎవరు ఏమి చేయలేరు... అంటూ నర్మగర్భంగా ఓ రెవెన్యూ అధికారి బాధిత రైతుతో మాట్లాడుతుంటే వారి అక్రమాలు ఏ స్థాయికి చేరిపోయాయో అర్థం చేసుకోవచ్చు. సరే కొంతమందికి అధికారులు తప్పులకు అలవాటుపడి ఇలా చేస్తున్న... ఆ పై అధికారులు న్యాయం చేస్తారనుకుంటే మూడేళ్లుగా తిరిగి తిరిగి చెప్పులు అరిగాయే తప్ప బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. ఈ పరిస్థితి ఎక్కడో కాదు కట్టంగూరు మండలానికి సంబంధించిన భూముల వ్యవహారంలో..

పూర్తి వివరాల్లోకి వెళితే...

కట్టంగూరు మండలం గార్లబాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని తేలువారిగూడెం గ్రామానికి చెందిన వంగూరు చంద్రయ్యకు చెరువన్నారం గ్రామ రెవెన్యూ పరిధిలో 6- 18 ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉంది. సర్వే నెంబర్ 155 లో ఎ 1-23, 157లోఎ 2-10, 161లో ఎ 0-27, 162లో ఎ0-18, 155లో ఎం 1-20 కలిపి మొత్తం 6-18 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి తాతల కాలం నుంచి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తి. అయితే భూ యజమాని దాదాపు రేండేళ్ల క్రితం మరణించారు. ఆయన మరణం తర్వాత భార్య అయిన వంగూరి లక్ష్మమ్మ పేరుతో ఫౌతి చేయాలని, వారి వారసులు వంగూరి రాంమూర్తి, వంగూరి రవి లు అనేక సందర్భాలలో వినతి పత్రం అందజేశారు.

సంబంధం లేని వ్యక్తులకు పట్టా...

తమ తండ్రి మరణించారని, ఆయన పేరు మీదున్న 6-18 ఎకరాల భూమిని మా తల్లి వంగూరు లక్ష్మమ్మ పేరుమీద పూర్తి చేయాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కానీ వాళ్ళ వినతిపత్రానికి స్పందించని రెవెన్యూ అధికారులు ఆ భూమితో ఎలాంటి సంబంధంలేని కొంతమంది వ్యక్తులకు దొంగ డెత్ సర్టిఫికెట్ ను ఆధారం చేసుకుని పట్టా చేసినట్లు సమాచారం. 2022 సెప్టెంబర్ 30వ తేదీన కట్టంగూర్ డిప్యూటీ తహశీల్దారు భూమి తో సంబంధం లేని వ్యక్తులతో స్వయంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని, అదే రోజు స్లాట్ బుకింగ్ చేయడం, వెంటనే భూమి పట్టా మారడం ... మూడు పనులు కూడా ఓకే రోజు జరగడంలో దానికి వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకోవచ్చు. ఈ పట్టా మార్పు సమయంలో ఎటువంటి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ కూడా లేదని సమాచారం.

రూ.20లక్షలకుపైగానే చేతులు మారిన వైనం....?

కట్టంగూరు మండలంలో భూముల విలువ ఎకరానికి సుమారు రూ.40 లక్షల పైనే ఉంటుంది. ఆ లెక్కన 6-18 ఎకరాలకు రూ.2.50కోట్ల విలువ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ భూమి అక్రమ పట్టా మార్పిడి జరిగే సమయంలో సుమారు రూ.20 లక్షలకు పైనే సొమ్ము చేతులు మారినట్లు సమాచారం. ఈ మొత్తం అక్రమ పట్టా మార్పిడిగా వారంలో డిప్యూటీ తహశీల్దార్ తో పాటు , ఓ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ ), డాక్యుమెంట్ రైటర్ కీలక సూత్రధారులని తెలుస్తుంది. రాజకీయంగా తమకు పలుకుబడి ఉందనే భావనలో అక్రమార్కులు కట్టంగూరు మండలం లో అక్రమ భూ పట్టాలకు పాల్పడుతున్నట్లు వినికిడి. వీళ్ళ పాత్ర కీలకంగా ఉందనే విషయం పై ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిసిన చర్యలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా కట్టంగూరు మండలం లో జరుగుతున్న అక్రమ భూపట్టాల మార్పిడిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయాలని బాధితులు కోరుతున్నారు.

మూడేళ్లుగా దరఖాస్తులు ఇస్తున్నా…: వంగూరి రాంమూర్తి, బాధిత రైతు..

మా నాన్న మరణించిన నాటి నుంచి దాదాపు మూడేళ్లకు పైగా అధికారులకు దరఖాస్తులు ఇస్తూనే ఉన్న. కానీ తమ పేరు మీద కావలిసిన భూమి పట్ట సంబంధంలేని వ్యక్తులపైన పట్టా జరిగింది. కట్టంగూరు మండలంలో జరిగిన, జరుగుతున్న అక్రమ భూపట్టాల పై విచారణ చేసి న్యాయం చేయాలి కోరుతున్నా.

జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించాం.. : ప్రసాద్, మండల తహసీల్దార్ కట్టంగూర్

2022 లో పట్టా జరిగిన మాట వాస్తవం. ఆ పట్టా జరిగిన విషయం పై విచారణ చేసి పూర్తి నివేదిక కలెక్టర్ కు పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి.

Next Story

Most Viewed