తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ రాజుకున్న కృష్ణానది జల వివాదం

by Disha Web Desk 11 |
తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ రాజుకున్న కృష్ణానది జల వివాదం
X

దిశ, నాగార్జునసాగర్ : కృష్ణా జలాల నీటి వాడకం పై ఏపీ ప్రభుత్వం కయ్యానికి కాలు తువ్వుతున్నట్లు కన్పిస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న టెలీఫండ్ ప్రాజెక్ట్ నుంచి ఏపీ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా సుమారు 4 టీఎంసీల నీటిని దొంగచాటుగా అక్రమంగా తరలించుకు పోయినట్లు రిటైర్డ్ ఇంజినీర్ లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా సాగర్ ప్రాజెక్టు పవర్ హౌస్ వద్ద టెయిల్ పాండ్ రివర్స్ బుల్ వాటర్ స్టోరేజీ ప్రాంతం అంతా పూర్తిగా ఎండిపోయింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ దిగువనున్న టెయిల్ పాండ్ నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

టెల్ పాండ్ నీటి నిల్వల మటుమాయం వ్యవహారంలో తెలంగాణ నీటిపారుల శాఖ అధికారుల వ్యవహరించిన తీరు చూస్తుంటే చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లు తయారైంది. నాగార్జునసాగర్ నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఉన్న టెయిల్ పాండ్ లో ఉన్న సుమారు 4 టీఎంసీల నీటి నిల్వలు ఖాళీ అయ్యాయి. కళ్ళముందే నీటి చౌర్యం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు సర్వత్ర వెల్లువెత్తుతున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగున ఉన్న టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి అత్యవసర సమయంలో రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ జెన్కో అధికారులు పవర్ హౌజ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంటారు.

కానీ గత కొద్ది రోజులుగా సాగర్ డ్యాంకు దిగువన టెయిల్ పాండ్ కుడివైపు ప్రాంతంలో ఉన్న మొత్తం నీటిని ఏపీ ప్రభుత్వం అక్రమంగా లూటీ చేసి దిగువకు తరలించకపోయినట్లు తెలుస్తుంది. నాగార్జున సాగర్ డ్యాం దిగువన ఉన్న సుమారు 4 టీఎంసీల వరకు నీరు కాళీ అవ్వగా రివర్స్బుల్ వాటర్ స్టోరేజీ ప్రాంతం అంతా పూర్తిగా ఎండిపోయి పెద్ద పెద్ద బండ రాళ్లు తేలి ఇసుక మేటలు బయట పడ్డాయి. కండ్ల ముందే నీటి నిల్వలు మాయం అవుతున్నా అధికారులకు ఎలాంటి అనుమానం రాకపోవడం విచారకరం. టెయిల్ పాండ్ గేట్ల నుంచి అక్రమంగా ఏపీ నీటిని తరలించకపోయినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు విచారణలో తేలినట్లు తెలుస్తుంది.

ఏపీ దొంగచాటుగా వ్యవహరించిన నీటి తస్కరింపుతో ఉమ్మడి నల్గొండ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు కలిగే ప్రమాదం ఏర్పడింది. కాగా ఇదిలా ఉంటే గత రెండు రోజుల కిందట అడవిదేవులపల్లి వద్ద గల టెయిల్ పాండ్ ను రాష్ట్ర నీటిపారుదల శాఖ కమిషనర్ సుల్తానియా సందర్శించారు.టెయిల్ పాండు లోని నీటిని గుట్టుచప్పుడు కాకుండా తరలించిన ఏపీ వ్యవహారాన్ని స్థానిక అధికారులతో చర్చించారు. నీటి చౌర్యం వ్యవహారం పై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఏపీ నీటి మాయం కుట్రలపై తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ కి లేఖ రాయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed