ఆ సారు మావాడే...పైసలిస్తే పథకాలిప్పిస్తాం...

by Sridhar Babu |   ( Updated:2022-12-06 10:50:08.0  )
ఆ సారు మావాడే...పైసలిస్తే పథకాలిప్పిస్తాం...
X

దిశ, మర్రిగూడ : దళిత బంధు పథకం ఇప్పిస్తా నాకు లంచంగా రూ.రెండు లక్షలు ఇవ్వాలి... ఇంటి జాగా ఉంటే రూ.మూడు లక్షలు ఇప్పిస్తా నాకు రూ.లక్ష ఇవ్వాలి.. మా సారు సంతకం పెడితే ఈ పథకాలు వస్తాయి...పైసలు ముట్ట చెపితే ఇప్పించే పూచి నాది అని ఓ సారు పేరు చెప్పి ఆయన శిష్యులు పైసల్ వసూలు కార్యక్రమానికి తెరలేపిన సంఘటన మండలంలో చర్చ నీయాంశంగా మారింది. మునుగోడు బై ఎలక్షన్ లో విజయం సాధించిన అధికార పార్టీ చోటా నాయకులు తెగ ఉత్సాహంతో ఉన్నారు. కొంత నగదును వెనుకేసుకోవడానికి ఇదే అదునుగా భావించి పైరవీలకు తెర లేపారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆర్థిక అభివృద్ధికి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం, ఇల్లు లేని పేదలకు ఇంటి జాగా ఉంటే మూడు లక్షలు మంజూరు పథకం పైరవీకారులకు వరంగా మారింది. నియోజకవర్గానికి 500 మందికి దళిత బంధు స్కీం మంజూరయ్యాయి. ఇంటి జాగా ఉన్న ప్రతి ఒక్కరికి మూడు లక్షల రూపాయలు మంజూరు కానుండడంతో ఓ సారు పేరు చెప్పి వసూలు పర్వానికి ఆయన శిష్యులు తెర లేపారు. ప్రతిరోజూ ఉదయాన్నే గ్రామాల నుండి పట్టణానికి బయల్దేరి ఆ సారు ఇంటి ముందు ఉండి పైరవీలు చేస్తున్నామని ఆ సారు తో కలిసిన ఫోటోలను పేపర్లో చూపించి అమాయకులను నమ్మబలుకుతున్నారు. పథకం మంజూరు కాకపోతే ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చే బాధ్యత తమదేనని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా వందల సంఖ్యలో పైరవీ కారులు స్కీముల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పథకం అమలుకు నోచుకోక ముందే ఇలాంటి పైరవీలకు తెరలేపిన దళారులపై అధికార పార్టీ నాయకులు, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

Next Story