Deputation : డిప్యూటేషన్ల ఉత్తర్వులతో అయోమయంలో ఉపాధ్యాయులు

by Aamani |
Deputation : డిప్యూటేషన్ల ఉత్తర్వులతో అయోమయంలో ఉపాధ్యాయులు
X

దిశ,రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ నుంచి వెలువడిన డిప్యూటేషన్ల ఉత్తర్వులతో ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అగమ్య గోచరంగా మారడంతో పాటు ఉపాధ్యాయులు ఆందోళనలో పడ్డారు. ఈనెల 20వ, తేదీన ఫుల్ అడిషనల్ చార్జ్ జిల్లా విద్యాధికారి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పలు మండలాలలోని 121 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలోని ఎస్ జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఇతర ఉపాధ్యాయులు ఆదేశించిన పాఠశాలలకు వెళ్లాలని అందుకోసం సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎమ్. ఈ. ఓ లు వెంటనే ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా 121 మందికి డిప్యూటేషన్ కల్పిస్తూ పూర్తి వివరాలతో జాబితా సిద్ధం చేసి అన్ని మండలాలకు పంపించారు. ఇలా రాజపేట మండలంలో 9 మంది ఉపాధ్యాయులకు పనిచేస్తున్న పాఠశాల నుండి వేరే పాఠశాలకు డిప్యూటేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు.

బేగంపేట పాఠశాలలోని శ్రీధర్ సింగారం పాఠశాలకు, దూది వెంకటాపురం పాఠశాల ఉదయ కుమార్ రఘునాథపురంకు, సింగారం ఉన్నత పాఠశాల కొల్లూరు అన్నపూర్ణ కుర్రారం పాఠశాలకు మూడు రోజుల విద్యాబోధన కోసం, రాజపేట ఏ. అనిత నమిల ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ ఖాళీగా ఉండడంతో అక్కడికి డిప్యూటేషన్ వేశారు. బొందుగుల శ్రీపాద రమేష్ కుర్రారం ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయునిగా డిప్యూటేషన్ వేయగా, యాదగిరిగుట్ట ఉపాధ్యాయురాలని దూది వెంకటాపురం ఉన్నత పాఠశాలకు, రాజాపేటఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయురాలు కె. సౌజన్య పాముకుంట ఉన్నత పాఠశాలకు, తుర్కపల్లి మండలం మాదాపురం శివరాజా పారుపల్లి ఉన్నత పాఠశాలకు, పాముకుంట పారిజాత పారుపల్లి ఉన్నత పాఠశాలకు డిప్యూటేషన్ పై వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో డిప్యూటేషన్ ప్రక్రియలో ఉన్న ఉపాధ్యాయులు 75% అసంతృప్తితో ఉన్నారు.

రాజపేట పాఠశాలలోని ఉపాధ్యాయులు డిప్యూటేషన్ నిరాకరిస్తూ స్వయంగా లిఖిత పూర్వకంగా జిల్లా విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఆయా పాఠశాలల పేరెంట్స్ విద్యార్థులు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్జస్ట్మెంట్ సింగిల్ టీచర్లు అవసరం ఉన్న పాఠశాలలకు పంపిస్తున్నామని వారంలో మూడు రోజులు పని చేయాలని పోస్టులు ఖాళీగా ఉన్నాయని కారణాలు చూపిస్తూ ఉపాధ్యాయుల డిప్యూటేషన్ కార్యక్రమానికి తెర లేపారు. తమ పాఠశాలలోని ఉపాధ్యాయులు డిప్యూటేషన్ వెళ్తే ఊరుకునేది లేదని రాజపేట పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన బదిలీల ప్రక్రియ కారణంగా ఏర్పడిన ఖాళీలను డిప్యూటేషన్ పేరుతో అడ్జస్ట్మెంట్ చేస్తూ చేతులు దులుపుకోవడం న్యాయం కాదని ప్రభుత్వ పాఠశాలల లో విద్యాబోధనపై తల్లిదండ్రులకు విద్యార్థులకు నమ్మకం పోతుందని విమర్శించారు. ఖాళీగా ఉన్న స్థానాలలో డీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ అయ్యే వరకు వెంటనే వాలంటీర్లను తీసుకోవాలని, డిప్యూటేషన్ల ప్రక్రియను మానుకోవాలని హెచ్చరించారు.



Next Story