సొంత పార్టీ నేతల నుంచి ఎమ్మెల్యే పైళ్ల‌కు తీవ్ర వ్యతిరేకత

by Mahesh |
సొంత పార్టీ నేతల నుంచి ఎమ్మెల్యే పైళ్ల‌కు తీవ్ర వ్యతిరేకత
X

దిశ, నిఘా బ్యూరో: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. భువనగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండటంలో విఫలమవుతూ వస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యల కంటే ఎక్కువగా తన వ్యాపార కార్యకలాపాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతుండడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గమైన భువనగిరి వచ్చే ఎన్నికల్లో పార్టీ గల్లంతు అవ్వనుందా అంటే నియోజకవర్గం ఓటర్ల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.

భువనగిరి జిల్లా కేంద్రం రియల్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. ఓవైపు హైదరాబాద్.. మరోవైపు వరంగల్ నగరాలకు సెంటర్లో భువనగిరి ఉండడం.. వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించడం తక్కువ కాలంలో జరిగిపోయింది. ఇదే సమయంలో రియల్ వ్యాపారం పుణ్యమా అంటూ భూముల ధరలకు రెక్కలు రావడంతో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తీరు పైన సొంత పార్టీ నేతలే కాదు ప్రజల నుంచి సైతం రియల్ వ్యాపార ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత..

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ప్రజలకు చాలా తక్కువ సమయమే అందుబాటులో ఉండరనే చెప్పాలి. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా ఎమ్మెల్యేను కలవడం అనేది అంత ఈజీ కాదనే చర్చ నియోజకవర్గం అంతటా ఉంది. కానీ ఎన్నికల సమయం దగ్గర పడితే మాత్రం శేఖర్ రెడ్డి నియోజకవర్గంలో కనిపిస్తారని ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ పలు వ్యాపారాల నేపథ్యంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఎక్కువ ఉండబోరనేది మాత్రం వాస్తవమని చెప్పాలి.

దీంతో ప్రజలు క్షేత్రస్థాయి లీడర్లపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇదే సమయంలో క్షేత్రస్థాయి బీఆర్ఎస్ లీడర్లకు సైతం ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పెద్దగా సమయం కేటాయించకపోవడం వల్ల సదరు లీడర్లు ఇటు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక.. అటు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి టైమ్ కేటాయించక పోవడం వల్ల మధ్యలో నలిగిపోతున్నారు. దీంతో ప్రజల నుంచి సైతం సదరు లీడర్లు వ్యతిరేకతను మూటకట్టుకోవాల్సి వస్తోంది.

శేఖర్ రెడ్డికి తప్పని వర్గపోరు తిప్పలు..

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి వర్గపోరు తలనొప్పిగా మారింది. ప్రజల్లో రోజురోజుకి శేఖర్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెరుగుతుండడంతో భువనగిరి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న నేతలు జోరు పెంచారు. ఎలాగూ శేఖర్ రెడ్డి ప్రజల్లో ఉండరనే వాదనకు బలం చేకూరుస్తూ పలువురు నేతలు నియోజకవర్గంలో కలియ తిరుగుతూ ఉండటం గమనార్హం. ఇప్పటికే భువనగిరి నియోజకవర్గ టికెట్ పై జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, చింతల వెంకటేశ్వర రెడ్డి తదితర నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు.

దీనికి తోడు వలిగొండ, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లోని పలు గ్రామాల్లోని బీఆర్ఎస్ లీడర్లు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారు. వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలోనూ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఇటు ఓసి.. అటు బీసీ సామాజిక వర్గం నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే వలిగొండ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కంప్లీట్ అవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఎవరికి కేటాయించాలనే విషయంపై వెనక్కి తగ్గడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై సందిగ్ధత నెలకొంది.

Advertisement

Next Story