రెయిలింగ్ వద్దు.. బైపాస్ నిర్మాణం చేయాలి.. రైతుల ఆందోళన

by Aamani |
రెయిలింగ్ వద్దు.. బైపాస్ నిర్మాణం చేయాలి.. రైతుల ఆందోళన
X

దిశ, రామాయంపేట : రెయిలింట్ నిర్మాణం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.. బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ రైతులు నిర్మాణం పనులను అడ్డుకొని ఆందోళన నిర్వహించిన ఘటన రామాయం పేట జాతీయ రహదారి పై శుక్రవారం జరిగింది. జాతీయ రహదారి 44 పై అధికారులు రెయిలింగ్ నిర్మాణం పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకొని పనులను నిలిపి వేయాలని కోరారు. పనులు అడ్డుకొని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము గత కొన్ని సంవత్సరాల నుండి పంట పొలాలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని వారన్నారు. తమ పంట పొలాలకు వెళ్లాలంటే జాతీయ రహదారి దాటుకొని వెళ్లాలని వారన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న కారణంతో నేషనల్ హైవే అధికారులు సర్వీస్ రోడ్డు మూసి వేయడం సరికాదన్నారు.

తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కావున నూతనంగా బైపాస్ రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఇట్టి విషయమై నేషనల్ హైవే అథారిటీ అధికారి రాంబాబును వివరణ కోరగా... రామాయంపేట బైపాస్ పై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఎవరో హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టి సర్వీస్ రోడ్డు మూసి వేయాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. ఈనెల 28వ తేదీలోపు పనులు పూర్తి చేసి పూర్తి నివేదిక అందజేయాలని హైకోర్టు సూచించినట్లు నేషనల్ హైవే అథారిటీ అధికారి రాంబాబు పేర్కొన్నారు. కావున తాము స్థానిక ఎస్పి, పోలీసుల సహకారంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి వచ్చామన్నారు. కానీ రైతులు ఇక్కడ రోడ్డు మూసి వేయకుండా నూతనంగా బైపాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎస్సై బాలరాజు జోక్యం చేసుకొని రైతులకు నచ్చ చెప్పడంతో వెనక్కి తగ్గారు.

రామాయంపేట, గొల్లిపర్తి, కోమటిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు బైపాస్ దాటి పంట పొలాలకు వెళ్లాల్సి ఉంటుంది. తాము దహన సంస్కారాలు చేయాలంటే కూడా ఇదే బైపాస్ రోడ్డు దాటి వెళ్లాలి అని గొల్లిపర్తి వాసులు వారంటున్నారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టవద్దని, నూతనంగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలని హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టీం లీడర్(ఇండిపెండెంట్ ఇంజనీర్) రాంబాబు సూచించారు. 15 రోజుల వరకు ఇక్కడ ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టమని, అంతలోపు కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకోవచ్చని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జప్తి శివనూర్, చేగుంట లాగానే రామాయంపేట లో కూడా నూతన బైపాస్ రోడ్డు నిర్మించాలని వాహనదారులు, రైతులు, స్థానికులు కోరుతున్నారు.



Next Story

Most Viewed