వలిగొండలో యథేచ్ఛగా బహుళ అంతస్తులు

by Mahesh |
వలిగొండలో యథేచ్ఛగా బహుళ అంతస్తులు
X

దిశ, నల్లగొండ బ్యూరో: కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారుల వల్ల ఆ మండల కేంద్రంలో ప్రధాన రహదారి వెంటే అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు విరిగిపోతున్నాయి. అయినప్పటికీ భవంతుల చుట్టుపక్కల ఉండాల్సిన కనీస సౌకర్యాలు లేవు. అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకునే దిక్కు లేదు భవనాలు నిర్మించే యజమాన్యంతో కుమ్మక్కై జేబులు నింపుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టే విధంగా స్థానిక అధికారులు ప్రవర్తిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

వలిగొండలో అనుమతి లేని భవనాలు..

గ్రామపంచాయతీ పరిధిలో జి+ 2 భవనాల నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మించి నిర్మిస్తే నిబంధనలకు విరుద్ధం. అందులో భాగంగానే వలిగొండ మండల కేంద్రంలో, వెలువర్తి రోడ్డు, సుంకిశాల రోడ్, వెంకటేశ్వర కాలనీ , సాయి నగర్ కాలనీ, భువనగిరి- చిట్యాల ప్రధాన రహదారి పక్కనే అంబేద్కర్ భవన్ నుంచి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున బహుళ అంతస్తులు నిర్మించారు. ఒక్కొక్క భవనం మూడు నుంచి ఐదు ఫ్లోర్ల వరకు నిర్మిస్తున్నారు. కొన్ని భవనాలలో లిఫ్టులు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దాదాపు ఇప్పటివరకు వలిగొండలో 30 నుంచి 40 అనుమతి లేని బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇంకా కొత్తవి కూడా నిర్మాణాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే రోడ్డు వెంట నిర్మించిన భవనాల ముందు ఉన్న మురికి కాలువలను కూడా పూర్తిగా కప్పేశారు.

కాసులకు కక్కుర్తి పడి..

భవన నిర్మాణ యజమానులతో అధికారులు కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ బిల్డింగ్ యజమాని అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నారని గ్రామపంచాయతీకి ఫిర్యాదులు వెళ్లాయి. అయితే దానిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి తీసుకోకుండా వదిలేశారు దానికి తోడు వరుసగా రెండు రోజులు సెలవు వచ్చిన టైంలో స్లాబ్ వేసుకోవాలని భవనం యజమానికి సలహా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ తతంగం జరగడానికి భవన యజమాని దాదాపు రూ.5 లక్షల వరకు అధికారులకు మొత్తం ముట్ట చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రతి అనుమతి లేని భవనానికి మూడు నుంచి ఐదు లక్షల వరకు అధికారులకు ముడుపులు అందినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

డిపిఓ కు నివేదిక అందజేశాం: కేదారి ఈశ్వర్, ఎంపిఓ, వలిగొండ

మా దృష్టికి వచ్చిన అక్రమ నిర్మాణాల ను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేశాం. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నప్పటికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శి పై డీపీఓ కు నివేదిక అందజేశాం .

Advertisement

Next Story

Most Viewed