- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆందోళన వద్దు..అక్కంపల్లి ఘటనపై జలమండలి వివరణ

దిశ, నల్లగొండ బ్యూరో: నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం పరిధిలోని అక్కంపల్లి బాలెన్సింగ్ రిజర్వాయర్ లో చనిపోయిన కోళ్లను వేసినట్లు ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. దీనిపై జలమండలి స్పందించింది. ఉదయం రిజర్వాయర్ లో చనిపోయిన కోళ్లను స్థానికులు గుర్తించి, వివిధ ప్రభుత్వ విభాగాలకు సమాచారం అందించడంతో జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసు,రెవెన్యూ, జలమండలి అధికారులు అప్రమత్తమై స్థలాన్ని పరిశీలించారు.జలమండలి క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ వింగ్ (క్యూఏటీ) అధికారులతో పాటు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), థర్డ్ పార్టీ లూసిడ్ సంస్థ కోదండపూర్ నీటి శుద్ది కేంద్రాలను సందర్శించి, నీటి నమూనాలను సేకరించారు. ప్రాథమికంగా ఎలాంటి అవశేషాలు గుర్తించలేదని తెలిపారు. ఈ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐఎస్ ప్రమాణాలతో మూడంచెల క్లోరిన్ ప్రక్రియ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని వివరించారు.
వచ్చే వారం రోజుల పాటు ప్రతి గంటకు నీటి ప్రమాణాలను పరీక్షిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. నీటి సరఫరాలో జలమండలి ఇప్పటికే మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియ పద్ధతిని అవలంబిస్తుందని ఆయన తెలిపారు. మొదటి దశలో నీటి శుద్ధి కేంద్రాల (డబ్య్లూటీపీ) వద్ద, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల (ఎంబీఆర్) వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. నగర ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్ - 10500-2012) ప్రమాణాల్ని పాటిస్తూ.. శాస్త్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలనూ తీసుకుంటామని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.