గత పొరపాట్లు పునరావృతం కావద్దు : కలెక్టర్

by Disha Web Desk 11 |
గత పొరపాట్లు పునరావృతం కావద్దు : కలెక్టర్
X

దిశ,తుంగతుర్తి: పార్లమెంటు ఎన్నికల్లో సెక్టోరల్, పోలీసు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు స్పష్టం చేశారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన సెక్టార్, పోలీసు, రెవెన్యూ అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఎన్నికల నిర్వహించాలని, ఈ ఎన్నికల్లో విలేజ్ పోలీస్ వాలంటర్స్ ని ప్రతి బూతు వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ముందస్తుగా పరిశీలన చేయాలని కలెక్టర్ సూచించారు.సెక్టోరల్ అధికారులంతా ఎన్నిక పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

పిఓ, ఎపిఓ,ఇతర సిబ్బంది ఎన్నికల విధులు పూర్తిగా సెక్టోరల్ అధికారులకు తెలిసి ఉండాలి అన్నారు.సెక్టోరల్ అధికారులు వారికి కేటాయించిన సెక్టార్ రూట్ పరిధిలోనే అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరిగేలా తహసిల్దార్ లు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.సెక్టోరల్, పోలీసు అధికారులు గ్రామాల్లో పర్యటించి గ్రామం పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి టీమూలు ఇప్పటివరకు రూ. 5 కోట్ల 50 లక్షలు సీజ్ చేసిందని వివరించారు. అధికారులు ఎన్నికల పరివర్తన నియమావళికి లోబడి ఉండాలని, మండల ప్రజా పరిషత్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో వసతులను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ… ఎన్నికల విధుల పట్ల సెక్టోరల్, పోలీసు అధికారులంతా పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పోలింగ్ జరిగే ముందు రోజు పోలీసు అధికారులు వారి కేటాయించిన సెక్టార్ లోనే విధులు నిర్వహించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి బస్సులు బయలుదేరినప్పుడు పూర్తి బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల రోజు 5 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉన్నట్లయితే ఆ ప్రదేశంలో సిబ్బందిని ఎక్కువగా ఉండేలా చూడాలన్నారు.అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సమస్యాత్మక కేంద్రాల్లో లోపల,వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, డీఎస్పీ రవికుమార్,తహసిల్దార్ రమణారెడ్డి తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed