మోడీ హయాంలోనే దేశం అభివృద్ధి : కేంద్ర మంత్రి జై శంకర్

by Disha Web Desk 11 |
మోడీ హయాంలోనే దేశం అభివృద్ధి : కేంద్ర మంత్రి జై శంకర్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రధాని నరేంద్ర మోడీ హయాంలోనే భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. మంగళవారం భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ యాత్రలో భాగంగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ భువనగిరి ఏరియా ఆసుపత్రి, జగదేవ్ పూర్ చౌరస్తా, ప్రిన్స్ కార్నర్ మీదుగా పట్టణంలోని వినాయక చౌరస్తా వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా వినాయక చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. మోడీ వస్తే పరిశ్రమలు వస్తాయని,

మోడీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. భారతదేశ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు ముడిపడి ఉన్నాయని చెప్పారు. దేశంలో గత పది సంవత్సరాల క్రితం ఉన్న అభివృద్ధిని, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. దేశంలో హైవేలు, ఔటర్ రింగ్ రోడ్ లు, ఎయిమ్స్ లు లాంటివి వచ్చాయన్నారు. భూదాన్ పోచంపల్లి చీరలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని, ఇటీవల జరిగిన జీ 20 సదస్సులో అంతర్జాతీయ ప్రజాప్రతినిధులకు నరేంద్ర మోడీ పోచంపల్లి వస్త్రాలను అందించినట్లు గుర్తు చేశారు. కమలం గుర్తుకు ఓటేస్తే మోడీకి ఓటు వేసినట్లేనని చెప్పారు. భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.

మోడీని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదు : లక్ష్మణ్

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. భువనగిరి ఖిల్లా మీద బీజేపీ జెండా ఎగరాల్సిన సమయం వచ్చిందన్నారు. మచ్చలేని నాయకుడు, ప్రపంచమే గర్వపడే నాయకుడు నరేంద్ర మోడీ అని అలాంటి మోడీని విమర్శించేంత స్థాయి రేవంత్ రెడ్డికి లేదని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎగిరెగిరి పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో నరేంద్ర మోడీ పాలన సాగిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ కు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. మాదిగలకు వర్గీకరణ తోటే న్యాయం జరుగుతుందని చెప్పారు.

మోడీ అంటేనే అభివృద్ధి : బూర

నరేంద్ర మోడీ అంటేనే అభివృద్ధి అని, త్రీడీ పేరుతో మోడీ దూసుకుపోతున్నారని చెప్పారు. త్రీడీ అంటే ధర్మం, ధర్మం, అభివృద్ధి అని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు అమాయకులని, వారు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంలో చిక్కుకున్నారన్నారు. కాంగ్రెస్ కు ధన బలం ఉందని, కానీ తనకు మాత్రం మోడీ బలంగా, కార్యకర్తలు ప్రజలు బలంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి, భవిష్యత్తు ముఖ్యమంత్రి, ఒక హోమ్ మినిస్టర్ అనుకొని వాళ్లకు వాళ్లే అనుకుంటున్నారని చెప్పారు.

ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. 2009లో భువనగిరి ఎంపీగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి భువనగిరికి ఏం అభివృద్ధి చేశాడని ప్రశ్నించారు. కేవలం తన సొంత ఆస్తులు పెంచుకునేందుకే ప్రయత్నించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సొంత ఆస్తులు అమ్మి ప్రజలకు సేవ చేశానని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హామీల అమలులో విఫలమవుతుందన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లో బూర నర్సయ్య గౌడ్ తన రెండవ సెట్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

అట్టహాసంగా సాగిన యాత్ర..

నామినేషన్ యాత్ర భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ భువనగిరి ఏరియా ఆసుపత్రి, జగదేవ్ పూర్ చౌరస్తా, ప్రిన్స్ కార్నర్ మీదుగా పట్టణంలోని వినాయక చౌరస్తా వద్దకు చేరుకుంది. ర్యాలీలో కళాకారులు, నృత్యాలు, ఆటపాటలు, ఎడ్ల బండ్లతో ఆకర్షణీయంగా ర్యాలీ జరిగింది. ఈ నామినేషన్ ర్యాలీకి ఎమ్మార్పీఎస్ నాయకులు హాజరై మద్దతు పలికారు.‌



Next Story

Most Viewed