అధికారులూ.. ప్రోటోకాల్ మరిచారా..?

by Sumithra |
అధికారులూ.. ప్రోటోకాల్ మరిచారా..?
X

దిశ, చిలుకూరు : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని దూదియా తండాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన గిరిజనోత్సవాల్లో అధికారులు ప్రొటొకాల్ పాటించడం మరిచారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే వేదిక పై ఉండాలి. అందుకు భిన్నంగా జడ్పీటీసీ మాజీ సభ్యుడు బి.శివాజీ నాయక్, బేతవోలు గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడు తాళ్లూరి శ్రీనివాస్ ను దశాబ్ది సభా వేదిక పై ఆసీనులను అందజేశారు. ఎమ్మెల్యేకు స్వాగతం పలికేటప్పుడు, సభా ప్రాంగణంలో ' కోదాడ గడ్డపై గులాబి జెండా.. ఎగురుతోంది చూడు గుండెల నిండా' అనే బీఆర్ఎస్ పాటతో స్వాగతం పలకడం పలు విమర్శలకు తావిచ్చింది.

పార్టీ ప్రచారమా.. ప్రభుత్వ కార్యక్రమమా..

దశాబ్ది వేదిక పై ఆసీనుడైన ఒక నామినేటెడ్ పోస్టు నాయకుడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బొల్లం మల్లయ్య యాదవ్ కు దూదియా తండా నుంచి 300 మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఆయన మరి ఈ వేదికను ప్రభుత్వ వేదిక అనుకున్నాడో.. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార వేదిక అనుకున్నాడో.. ఆయనకే తెలియాలి మరి.. కోదాడ నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు మాట్లాడుతూ కోదాడ ఎమ్మెల్యేగా మల్లయ్య యాదవ్ ను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఫక్తు ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్లుగా మాట్లాడారు. ప్రభుత్వం పంపించిన ఆదేశాలకు భిన్నంగా అధికారులు దశాబ్ది వేదికను ఫక్తు బీఆర్ఎస్ పార్టీ వేదికగా మార్చారు. మండలానికి చెందిన ఒక ఉన్నతాధికారి అసలు సిసలు బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మాట్లాడారు.

ఎమ్మెల్యే మెప్పు పొందటానికో ఏమో మరి..! అతనికే తెలియాలి. ఇదిలా ఉండగా సభాప్రాంగణంలో ఉన్న పలువురు గిరిజనులు మాట్లాడుతూ దళిత బంధు, బీసీలకు రూ. లక్ష రుణాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తమకు గిరిజన బంధు ఎందుకు ఇవ్వరు..? అని 'దిశ'తో అనడం గమనార్హం. బీఆర్ఎస్ జెండాలు మాత్రమే లేవు తప్ప మొత్తంగా బీఆర్ఎస్ సభనే తలపించడం విచారకరం. తెలంగాణ ప్రజలు స్వేదం చిందించి, రక్త, మాంసాలు ధారపోసి చెల్లించిన పన్నుల్లోని నిధులతో నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారిక దశాబ్ది ఉత్సవాలు అధికారుల సాక్షిగా బీఆర్ఎస్ ప్రచార సభలుగా మారడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ పలువురు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అధికారులూ.. మీరేం చేస్తున్నారో.. ఏం చేయాలో కాస్త ఆలోచించండి.

Advertisement

Next Story

Most Viewed