కేసీఆర్ నన్ను మనిషిగానే చూడలేదు: Vemula Veeresham

by sudharani |   ( Updated:2023-08-24 04:09:29.0  )
కేసీఆర్ నన్ను మనిషిగానే చూడలేదు:  Vemula Veeresham
X

దిశ, నల్లగొండ బ్యూరో : జిల్లా మంత్రిగా ఉన్న గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పార్టీ పటిష్టతకు పనిచేయాల్సింది పోయి వర్గాలను పెంచి పోషిస్తున్నారని, తోటి లీడర్ల ఎదుగుదలను సహించలేక రాజకీయంగా అణచివేసే చర్యలకు పాల్పడుతున్నారని నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మంత్రే ఉద్దేశపూర్వకంగా గ్రూపులు సృష్టిస్తున్నారని తెలిపారు. తన ఎదుగుదలను సహించలేక కక్ష పెంచుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గన్‌మెన్‌ను తీసేసినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారని, కనీసం పార్టీ సభ్యత్వాన్నీ ఇప్పించలేని స్థాయికి ఆయన దిగజారిపోయారని అన్నారు.

పార్టీ అధినేత కేసీఆర్ సైతం తనను ఏనాడూ మనిషిగా చూడలేదని, తనపై పోలీసు కేసులు పెడుతున్నా, తన అనుచరులను వేధిస్తున్నా సైలెంట్‌గానే ఉండిపోయారని వేముల వీరేశం ఆరోపించారు. విధిలేని పరిస్థితుల్లోనే అనుచరుల అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. నాలుగున్నరేళ్లుగా మానసిక వేదనను అనుభవించిన తాను ఇకపైన ఓపిగ్గా ఉండలేని దయనీయ పరిస్థితుల్లో ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీలో చేరాలన్నది కార్యకర్తల అభిప్రాయం మేరకు వారం, పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌కు రాజీనామా నిర్ణయం సందర్భంగా ఆయన ‘దిశ’తో తన మానసిక వేదనను పంచుకున్నారు.

ప్రశ్న : పార్టీకి రాజీనామా చేయాలన్న నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది?

జవాబు : తెలంగాణ మలి దశ ఉద్యమం ఉధృతమైన 2009 నుంచి నేను టీఆర్ఎస్‌లో ఉన్నాను. కేసీఆర్ వెంటే నడిచాను. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాపైనా, నా వెంట నడిచిన కార్యకర్తలపైనా కేసులు పెట్టింది. ఇప్పటికీ కేసులున్నాయి. 2014లో ఎమ్మెల్యేగా గెలిచాను. గత ఎన్నికల్లో ఓడిపోయాను. అప్పటి నుంచి నన్ను పార్టీ కనీసంగా పట్టించుకోలేదు. పొమ్మనలేక పొగ పెట్టే తీరులో వ్యవహరించింది. నాలుగున్నరేళ్ల పాటు ఓపిగ్గా వెయిట్ చేశాను. నన్ను ఇగ్నోర్ చేసింది. ఇమడలేని పరిస్థితుల్లో బైటకు వెళ్లిపోవాలనే నిర్ణయం తీసుకున్నా.

ప్ర : టికెట్ రానందుకేనా?

జ : నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నదే మంత్రి జగదీశ్‌రెడ్డి. నా ఎదుగుదలను ఆయన జీర్ణించుకోలేకపోయారు. రాజకీయంగా అణచివేయడం మొదలు పెట్టారు. నా గన్‌మెన్‌ను తొలగించినా ఆయన పట్టించుకోలేదు. పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వకున్నా నోరెత్తలేదు. నా ఆవేదన చెప్పుకున్నా స్పందించలేదు. జిల్లా మంత్రిగా తోటి లీడర్లను ఎదిగించడానికి బదులుగా తొక్కిపెట్టే చర్యలకు పాల్పడ్డారు. నాలుగున్నరేళ్లలో పార్టీ ట్రీట్‌మెంట్ చూసిన తర్వాత టికెట్ వస్తుందనే భ్రమలేమీ నాకు లేవు.

ప్ర : జిల్లా మంత్రిపై ఇప్పుడే ఎందుకు ఆరోపణలు?

జ : వాస్తవానికి గత ఎన్నికల సందర్భంగా జరిగిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఆ వేదిక మీద నేను మాట్లాడాను. అప్పటి నుంచే నాపైన జగదీశ్‌రెడ్డి కక్ష పెంచుకున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో పోలీసులు నాపైన కేసులు పెట్టినా, నా అనుచరులను శారీరకంగా, మానసికంగా వేధించినా ఆయన పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని జిల్లా మంత్రిగా ఆయనతో షేర్ చేసుకున్నా. కానీ ఫలితం శూన్యం. ఆయన ఏమీ చేయరని నాకు అర్థమైపోయింది. చాలా కాలంగా ఆవేదన చెందుతున్నా. టికెట్ రాకపోవడానికి, ఇప్పుడు నిర్ణయం తీసుకోడానికి సంబంధం లేదు. నా ఓపిక నశించడంతో రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాను.

ప్ర : కేసీఆర్‌తో చెప్పుకుంటే పరిష్కారమయ్యేది కదా!

జ : ఈ నాలుగున్నరేళ్లలో కేసీఆర్ ఏనాడూ నా గురించి పట్టించుకోలేదు. నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనను కలిసే అవకాశమూ లేకుండా పోయింది. కనీసం మనిషిగానూ చూడలేదు. నా వెంట నడిచిన సర్పంచ్‌లను, ఎంపీటీసీలను పోలీసు కేసులతో వేధించినా కేసీఆర్ నుంచి చలనం లేదు. ఆత్మగౌరవాన్ని కోల్పోయాను. అది లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. అధినేత సక్రమంగా ఉంటే నా లాంటి ఎంతో మందికి ఇలాంటి దయనీయ పరిస్థితులు తలెత్తేవి కావు.

ప్ర : ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారు కదా!

జ : కార్పొరేషన్ చైర్మన్ పదవిని, ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ఏనాడూ నాకు అలాంటి హామీ రాలేదు. కనీసం పలకరింపే లేదు. ఇలాంటి ఆఫర్లు నన్ను బద్నాం చేయడానికి పార్టీ నేతలు సృష్టిస్తున్నవే. రాజకీయంగా నన్ను చంపేస్తూ ఉంటే ఈ పదవులు, హామీలు ఎందుకిస్తారు? నిజానికి అలాంటివి వస్తాయనే ఆశలు లేవు, అలాంటి భ్రమలూ లేవు.

ప్ర : కేటీఆర్, కేసీఆర్ కన్విన్స్ చేశారేమో !

జ : ఆ ఇద్దరూ ఈ నాలుగున్నరేళ్లలో నాతో ఏనాడూ మాట్లాడలేదు. జిల్లా మంత్రి ఆదేశాలతో పోలీసులు చేస్తున్న వేధింపులు వారికి తెలియందేమీ కాదు. నేను ప్రయత్నిస్తే వారు కాంటాక్టులో లేనప్పుడు ఇక హామీలు, కన్విన్సింగ్ ఎక్కడిది?

ప్ర : కేసీఆర్ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తే మనసు మార్చుకుంటారా?

జ : మార్చుకోను. ఆ స్టేజీ దాటిపోయింది. నాలుగున్నరేళ్ల మానసిక వేదన నాకు చాలా నేర్పింది. నా సహనం చచ్చిపోయింది. వెయిటింగ్ చేసే ఓపిక లేదు. భరించే శక్తి అంతకన్నా లేదు. స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా వినేందుకు నేను సిద్ధంగా లేను. నా అభిమానులు, అనుచరులు, కార్యకర్తల నిర్ణయానికి వ్యతిరేకంగా నేను మనస్సు మార్చుకోవాలని అనుకోవడం లేదు. రాజీనామా చేయాలన్న నిర్ణయమే ఫైనల్.

ప్ర : నకిరేకల్‌లో ఈసారి పోటీ చేస్తారా?

జ : తప్పకుండా పోటీ చేస్తాను. ఏ ప్లాట్‌ ఫారం అనేది త్వరలో తేలుతుంది. నేను నా రాజకీయ శక్తిని ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కుంటాను. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే తలెత్తుకు తిరగాలని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే పరిస్థితే లేదు. నిలబడతాను.. పోరాడతాను.. గెలుస్తాను..

ప్ర : గెలిచేంత శక్తి ఉన్నదా?

జ : నా ధీమా నాకున్నది. నా శక్తి ఏంటో నాకు తెలుసు. ఎమ్మెల్యేగా లేకపోయినా కరోనా సమయంలో నా ప్రజలను నేను చూసుకున్నాను. ఎమ్మెల్యేకు బాధ్యత లేకున్నా నా శక్తి మేరకు ఆదుకున్నా. విద్య, వైద్యపరంగా నా వంతు కృషి చేశా. అది నియోజకవర్గ ప్రజలకు స్వీయానుభవం. వారే నన్ను గెలిపించుకుంటారు. నా వెంట నడిచి బాధలు అనుభవించిన వేలాది మంది నాకు అండగా ఉంటారు. నన్ను గెలిపించుకుంటారు.

ప్ర : దళితుడైనందుకే మంత్రి నుంచి, పార్టీ నుంచి వివక్షా?

జ : దళితబంధు స్కీమ్‌తో దళితులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. ఆ స్కీమ్ ద్వారా దళితులమీద చూపిస్తున్న ప్రేమ ఈ నియోజకవర్గ దళిత మాజీ ఎమ్మెల్యేగా నాపైన చూపించి ఉంటే పార్టీ అధినేతగా నాకు గౌరవం ఉండేది. నన్ను పార్టీ కరివేపాకులా వాడుకున్నదనేది మాత్రం స్పష్టం. జిల్లా మంత్రిగా జగదీశ్‌రెడ్డి కక్షసాధింపు ధోరణి, వేధింపులు, అణచివేతకు దళిత వివక్ష అనేది ఒక కారణం.. ఈ సంగతి ఎలా ఉన్నా నాలుగున్నరేళ్లలో ఆయన ఆచరణ మాత్రం నన్ను పొలిటికల్‌గా తొక్కేయడమే. కారణం ఆయనకే తెలియాలి.

ప్ర : తదుపరి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి?

జ : ఈ నాలుగున్నరేళ్లలో నేను పడిన బాధలన్నీ నా ప్రజలకు, అనుచరులకు, పార్టీ కార్యకర్తలకు తెలుసు. ఇక ఈ పార్టీలో ఉండొద్దని నన్ను కన్విన్స్ చేసిందే వారు. నా భవిష్యత్తును నిర్ణయించేది కూడా వారే. ఇప్పటికే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బైటకొచ్చాను. ఇకపైన ఏ పార్టీలోకి వెళ్లాలనేది వారం పది రోజుల్లో వారితో మాట్లాడి ఫైనల్ చేసుకుంటాను.

Advertisement

Next Story

Most Viewed