సూర్యాపేట బీఆర్ఎస్‌లో బూత్ కమిటీల చిచ్చు!

by samatah |   ( Updated:2023-08-03 02:57:25.0  )
సూర్యాపేట బీఆర్ఎస్‌లో బూత్ కమిటీల చిచ్చు!
X

దిశ, నల్లగొండ బ్యూరో : సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మూడు గ్రూపులుగా వర్ధిల్లుతున్నది. ఈ గ్రూపుల మధ్య సమన్వయం చేసి సఖ్యత సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా అవి బెడిసి కొడుతున్నాయి. సఖ్యత సంగతి దేవుడెరుగు కానీ ఒకచోట కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదు. దీంతో గ్రామస్థాయి నాయకులకు, కార్యకర్తలకు నచ్చజెప్పలేక మంత్రి జగదీశ్ రెడ్డి తల పట్టుకుంటున్నట్లు సమాచారం.

బూత్ కమిటీల పేరుతో..

సూర్యాపేట మున్సిపాలిటీ, సూర్యాపేట రూరల్, ఆత్మకూర్, చివ్వెంల, పెంపహాడ్ మండలాల్లో సుమారు 2.40 లక్షల ఓట్లు ఉన్నాయి. కాగా మూడోసారి విజయం సాధించాలని పటిష్టమైన ప్రణాళికతో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి 120 ఓట్లకు కమిటీ వేసి బూత్ లీడర్ ను నియమిస్తున్నారు. ఒక మండలంలోని క్రియాశీలక నాయకులు, ప్రజాప్రతినిధులు, మరో మండలంలో బూత్ కమిటీలు వేయడానికి ఇన్ చార్జిగా నియమించారు. వార్డుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులను ఎంపిక చేస్తున్నారు. అయితే ఈ బూత్ స్థాయి లీడర్ ఎప్పటికప్పుడు ఓటర్ల అవసరాలను తీర్చేలా చూడడం, ఎన్నికల్లో ఓట్లు చీలిపోకుండా చూసే బాధ్యతను అప్పగిస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా అనధికారికంగా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అంశాలన్నీ కూడా వీరి ద్వారానే జరుగుతాయని తెలుస్తోంది.

మూడు గ్రూపులు.. ఆరు తగాదాలు..

నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న బూత్ కమిటీల కారణంగా గ్రామాలలో మూడు గ్రూపులు ఆరు తగాదాలు అన్న చందంగా నాయకులు విడిపోతున్నారు. గ్రామాలలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ లీడర్ల ఎంపిక, వారి మాట చెల్లుబాటు అయ్యేలా చేస్తున్నారు. దీంతో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసినవాళ్లను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర పార్టీలో గెలిచి అధికార పార్టీలోకి వచ్చిన వాళ్లకు పెత్తనం ఇస్తూ పార్టీలోనే ఉండి ఓడిపోయిన వాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల ఇప్పటికే ఎడమొహం పెడమొహంగా ఉన్న నాయకుల మధ్య మరింత పెద్ద చిచ్చు పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ కమిటీలు కేవలం అసెంబ్లీ ఎన్నికల వరకే అయినప్పటికీ గ్రామంలో ఉన్న ప్రజా ప్రతినిధులు స్థానిక సంస్థల్లో తమకు ఉపయోగపడే విధంగా అనుకూలమైన వారిని బూత్ లీడర్లుగా నియమిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో సీనియర్ నాయకుల మధ్య తీవ్రమైన వివాదాలు ఉన్నాయి. ఈ కమిటీలతో దీంతో క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకుల మధ్య కూడా పొరపొచ్చాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిస్థితి రానున్న ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపనుందన్న చర్చ నియోజకవర్గ ప్రజల్లో సాగుతున్నది.

Read More : మాజీ ఎమ్మెల్సీకు గులాబీ గాలం

Advertisement

Next Story

Most Viewed