కీలక సమయంలో కాంట్రవర్సీలెందుకు: ఉత్తమ్

by GSrikanth |
కీలక సమయంలో కాంట్రవర్సీలెందుకు: ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డిలు చేసిన వ్యాఖ్యలు అధిష్టానం పరిధిలోనివని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం ఓ వైపు మునుగోడు ఉప ఎన్నిక మరో వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉందని ఇలాంటి పరిస్థితుల్లో కాంట్రవర్సీల విషయాలపై తాను స్పందించబోనని స్పష్టం చేశారు. తనది నల్గొండ జిల్లా అయినంత మాత్రాన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు మాట్లాడిన మాటలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ఉత్తమ్ కుమార్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులేంటో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించబోతున్నారని చెప్పారు. ఎవరు ఎంత డబ్బు, మద్యం పంచినా మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

స్రవంతిపై సానుభూతి పెరిగిందని తమ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపు ఉదయం తెలంగాణలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 10 కిలోమీటర్ల మేర తొలిరోజు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి మూడు రోజుల పాటు రాహుల్ యాత్రకు దీపావళి బ్రేక్ ఉంటుందని 26వ తేదీన మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా నేతలంతా ఢిల్లీకి వెళ్తారని చెప్పారు. 26వ తేదీ సాయంత్రం రాహుల్ గాంధీ తిరిగి తెలంగాణకు చేరుకుని 27న ఉదయం యథావిధిగా పాదయాత్ర కొనసాగిస్తారని వెల్లడించారు.

Advertisement

Next Story