జూన్ 4 తర్వాత రేవంత్‌కు మిగిలేది గాడిద గుడ్డే: MP లక్ష్మణ్

by Disha Web Desk 19 |
జూన్ 4 తర్వాత రేవంత్‌కు మిగిలేది గాడిద గుడ్డే: MP లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజీవ్ గాంధీ బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామంటే వ్యతిరేకించింది వాస్తవమా కాదా అనే విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సూచించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయాలు తెలుసుకోకుండా రాహుల్ గాంధీ.. అబద్ధాలు, అసత్యాలు, అవాస్తవాలు మాట్లాడారని, అంబేద్కర్ ఆశయాలను నీరు గార్చింది కాంగ్రెస్ అని ఘాటు విమర్శలు చేశారు. కులాల ఆధారంగా రిజర్వేషన్లు వద్దని నెహ్రూ అప్పటి సీఎంలకు లేఖ రాసిన మాట వాస్తవమా..? కాదా..? అనేది చూసుకోవాలన్నారు. ఈ విషయమై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే భాగ్యలక్ష్మి దేవాలయం వద్దకు వచ్చి ప్రమాణం చేసి చెప్పాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు.

దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోటీ జరుగుతోందని, ఈ ఎన్నికలు చాయ్ వాలాకు, ఆగర్భ శ్రీమంతుడు రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. దేశాభివృద్ధికి కుటుంబ రాజకీయాలకు మధ్య జరుగుతున్న పోటీ అని పేర్కొన్నారు. జూన్ 4 తర్వాత కాంగ్రెస్ కు పరాభవం తప్పదని, ఆ పార్టీకి చివరకు మిగిలేది గాడిద గుడ్డేననన్నారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజలను జలగలుగా పీడుస్తున్నారని లక్ష్మణ్ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలు కించపరిచేలా దిగజారి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. హిందూ దేవుళ్లంటే ఆయనకు ఎందుకు అంత కోపమని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి హిందువు అని చెప్పుకునే అర్హత లేదని ఆయన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి.. ఆయనకు కావాల్సిన వారితో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను నింపుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగులకు గాడిద గుడ్డు చూపుతున్నారని ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గాడిద గుడ్డు చూపుతున్నాడని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

Next Story

Most Viewed