ఆర్ఎస్ఎస్‌ను బ్యాన్ చేసేందుకు బీజేపీ కుట్ర..ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు

by samatah |
ఆర్ఎస్ఎస్‌ను బ్యాన్ చేసేందుకు బీజేపీ కుట్ర..ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను బ్యాన్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మహారాష్ట్రలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సైద్దాంతిక సంస్థ అయిన ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. శివసేనను ఉపయోగించుకున్న తర్వాత ఏం చేశారో, ఆర్ఎస్ఎస్‌ను కూడా అలాగే చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ప్రధాని మోడీ ఇదే పనిలో ఉన్నాడని, ఇటీవల నడ్డా చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ అని స్పష్టం చేశారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్‌కే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందన్నారు. శివసేనను నకిలీ పార్టీ అని పిలిచిన వారు సంఘ్‌ను కూడా నకిలీ అని పిలుస్తారని ఎద్దేవా చేశారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు మొత్తం మోడీని ప్రధానమంత్రిని చేసేందుకు శ్రమిస్తున్నారు. కానీ మోడీ మాత్రం ఆ సంస్థలు శాశ్వతంగా బ్యాన్ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా బీజేపీ చీఫ్ నడ్డా మాట్లాడుతూ..బీజేపీకి ఆర్ఎస్ఎస్‌తో పని లేదని, ఆర్ఎస్ఎస్‌పై ఆధారపడే స్థాయి నుంచి బీజేపీ సొంత నిర్ణయాలు తీసుకునే దిశగా ఎదిగిందని తెలిపారు. పార్టీ నిర్మాణం ఎంతో బలంగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే థాక్రే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

Next Story