MP ఎలక్షన్స్ టార్గెట్‌.. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కాంగ్రెస్ వ్యూహమిదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-06 04:08:39.0  )
MP ఎలక్షన్స్ టార్గెట్‌.. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కాంగ్రెస్ వ్యూహమిదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ లీడర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. వచ్చే వారంలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. కార్పొరేషన్ ఛైర్మన్ల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. సంక్రాంతి లోపే కొన్ని జీవోలు విడుదల చేయనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నది.

ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో జిల్లాకు ముగ్గురు చొప్పున కనీసం 25 నుంచి 30 మందికి పోస్టులు ఇవ్వాలని ఆలోచిస్తున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలు పెట్టింది. ఇన్‌చార్జ్ మంత్రుల నేతృత్వంలో నామినేటెడ్ పదవుల అభ్యర్థుల జాబితానూ టీపీసీసీ సేకరించింది. ఆ లిస్టులోని పేర్లను ఫిల్టర్ చేసి ప్రభుత్వానికి సింగిల్ నేమ్ తో జాబితా పంపనున్నది. సీఎం, క్యాబినెట్ మంత్రుల నిర్ణయంతో కార్పొరేషన్ ఛైర్మన్లను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

నేతల్లో జోష్ నింపేందుకు..?

సంక్రాంతిలోపు కొన్ని నామినేటెడ్ పదవులు నింపితే సెకండ్ కేడర్, క్షేత్రస్థాయి లీడర్లలో కొంత జోష్ వస్తుందనేది పార్టీ విశ్వాసం. ఛైర్మన్ పదవులు ఇవ్వడం వలన ఆయా నేతలు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా, అనుచరులనూ ప్రోత్సహిస్తూ పార్టీ విజయానికి ఉత్సాహంగా కృషి చేస్తారని టీపీసీసీ భావిస్తోంది. పైగా నామినేటెడ్ పదవుల ప్రకటన మొదలైతే లీడర్లు, కార్యకర్తల్లోనూ పార్టీపై భరోసా పెరుగుతుంది. మరోవైపు ఫస్ట్‌రౌండ్‌లో ఛైర్మన్ పదవులు పొందలేకపోయినోళ్లూ గుర్తింపు కోసం మరింత యాక్టివ్‌గా పనిచేసే ఛాన్స్ ఉన్నది. ఇవన్నీ ఎంపీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పతాయని పార్టీ బలంగా నమ్ముతున్నది. ఇదే విషయాన్ని సర్కారుకు వివరించగా... సీఎంతో పాటు కేబినెట్ మంత్రులూ ఒకే చెప్పినట్లు సమాచారం. దీంతో సంక్రాంతి లోపు నామినేటెడ్ పదవుల జోష్ మొదలు కానున్నది.

సర్కార్ స్ట్రాటజీ...?

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు గెలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 15 ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకోగా, 12 కు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ, ప్రభుత్వం చర్చించి ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల కోసం గాంధీభవన్‌లోని నేతలతో పాటు జిల్లాల్లోనూ లీడర్లు పోటీపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా కార్పొరేషన్ పదవులు ఉన్నాయి.

వీటిలో కొన్ని కేబినేట్‌తో కూడిన ఛైర్మన్లు ఉండగా, మరి కొన్నింటికి లేవు. కీలక నేతలంతా కేబినేట్‌తో కూడిన ఛైర్మన్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. మరికొందరు ఏ ఛైర్మన్ ఇచ్చినా తమకు ఫర్వాలేదని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం మొదట్నుంచి పనిచేసినోళ్లతో పాటు ఎన్నికల ముందు పార్టీ విజయం కోసం కృషి చేసినోళ్లూ ఈ జాబితాలో ఉన్నారు. దీంతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి, చివరి నిమిషంలో టిక్కెట్లు కోల్పోయినోళ్లూ కార్పొరేషన్ ఛైర్మన్ల పదవుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదివరకు ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా పనిచేసిన ఆయా విభాగాల ఛైర్మన్లనే ప్రభుత్వంలోకి తీసుకోవాలని సీఎంతో పాటు మెజారిటీ కేబినెట్ మంత్రులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మిగతా శాఖల కార్పొరేషన్లను కూడా పార్టీ కోసం పని చేసినోళ్లకు అవకాశం కల్పిస్తూనే సమీకరణాలనూ పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ల పదవులను దక్కించుకునేందుకు ఇటు సీనియర్లతో పాటు యంగ్ లీడర్లూ పోటీ పడటం గమనార్హం.

Also Read..

MLC బరిలో తీన్మార్ మల్లన్న..? కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్!

Advertisement

Next Story

Most Viewed