కూన వర్సెస్ మొవ్వా

by Javid Pasha |
కూన వర్సెస్ మొవ్వా
X

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి టీడీపీ టికెట్ పై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుండి వి.ఆనంద్ ప్రసాద్ పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు. ఆతర్వాత ఆయన కనుమరుగై పోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు శేరిలింగంపల్లిలో టీడీపీ నుండి చెప్పుకోతగ్గ నాయకుడు లేడనే చెప్పాలి. కానీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో మరోసారి టీడీపీ అభ్యర్థి ఎవరు అనేదానిపై చర్చ నడుస్తుంది. గత రెండు రోజుల నుండి ఈ చర్చ తారాస్థాయికి చేరుకుంది. అసలు ఈసారి శేరిలింగంపల్లిలో టీడీపీ బరిలో ఉంటుందా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ టీడీపీ నుండి పక్క నియోజకవర్గ నాయకుడు శేరిలింగంపల్లి బరిలో నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు. అయితే ఈసారి ఇక్కడి నుండి బీజేపీ నాయకుడు మొవ్వా సత్యనారాయణను బరిలో ఉంచాలని ప్రయత్నిస్తున్న మాజీ టీడీపీ నాయకులకు ఇది మింగుడు పడడం లేదు.

అప్పుడు ముదిరాజ్, ఇప్పుడు గౌడ్

సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన కూన వెంకటేష్ గౌడ్ ఈనెల 26న అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. దీని వెనక అనేక ప్రయోజనాలు, రాజకీయాలు ఉన్నట్లు చర్చ నడుస్తుంది. నగరంలో అంతంత మాత్రంగానే ఉన్న టీడీపీకి కూన రాకతో కొంత వరకు మేలు జరుగుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. ఇప్పటికే ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రియార్టీ ఇస్తూ కాసాని జ్ఞ్యానేశ్వర్ రావును రాష్ట్ర టీడీపీ పగ్గాలు అప్పగించగా, గౌడ సామాజిక వర్గానికి చెందిన కూన వెంకటేష్ గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా నగరంలో పార్టీకి ప్లస్ అవుతుందని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు ఆపార్టీ శ్రేణులు.

శేరిలింగంపల్లి బరిలో కూన

సనత్ నగర్ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేస్తారనుకున్న కూన వెంకటేష్ గౌడ్ శేరిలింగంపల్లికి షిఫ్ట్ అవుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. సనత్ నగర్ బీఆర్ ఎస్ కు చెందిన ఓ నాయకుడి వర్గీయులు పార్టీ మారి ఇక్కడి నుండి పోటీ చేయకూడదని కూనకు గట్టిగా చెప్పారని, గత పరిణామాల నేపథ్యంలో సనత్ నగర్ కాకుండా శేరిలింగంపల్లి నుండి పోటీచేస్తే బాగుంటుందని తేల్చిచెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే సనత్ నగర్ నుండి కాకుండా ఈసారి కూన వెంకటేష్ గౌడ్, లేదా ఆయన కుమారుడు గౌరీ శంకర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారని, అందులో భాగంగా శేరిలింగంపల్లికి చెందిన కొంతమంది నాయకులతో టచ్ లో ఉన్నారని, అంతర్గతంగా చర్చలు సాగిస్తున్నారని వినికిడి.

మొవ్వా వెనకా ముందు..

గతంలో టీడీపీలో ఉన్న మొవ్వా సత్యనారాయణ ఆ మధ్య టీఆర్ ఎస్( బీఆర్ ఎస్) లోకి తర్వాత బీజేపీలోకి మారారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నా ఆయన ఎన్నికల సమయానికి టీడీపీలో చేరనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతూ వచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ సామాజిక వర్గానికే చెందిన మొవ్వా సత్యనారాయణకు బీజేపీలో టికెట్ వచ్చేది కష్టమేనని, అందుకే మరోసారి టీడీపీలోకి వచ్చి ఆపార్టీ తరుపున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ నియోజకవర్గంలో జోరందుకుంది. మొవ్వా కోసం కొందరు మాజీ టీడీపీ నేతలు తీవ్రంగా చర్చలు సాగిస్తున్నారని, ఆయనకే టికెట్ కేటాయించేలా చంద్రబాబు నాయుడి మీద ఒత్తిడి తెస్తున్నారన్న ప్రచారం ఆపార్టీ శ్రేణుల్లో ఉంది. అయితే మొవ్వా టీడీపీలోకి రావడమా.. లేదా టికెట్ వచ్చినా రాకున్నా బీజేపీలో ఉండడమా అనేది తేల్చుకోలేక పోతున్నారని సమాచారం.

================

Advertisement

Next Story

Most Viewed