ప్రధాని నోటి వెంట ఓటుకు నోటు కేసు మాట..ఎంపీ ఎన్నికల వేళ ఆసక్తిగా మారిన మోడీ వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
ప్రధాని నోటి వెంట ఓటుకు నోటు కేసు మాట..ఎంపీ ఎన్నికల వేళ ఆసక్తిగా మారిన మోడీ వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక గూటి పక్షులే అని అవినీతి రాకెట్ లో ఈ రెండూ పార్టీలు భాగస్వాములేనని ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. మొన్నటి వరకు తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని... బీఆర్ఎస్ పాలనలో ఓటుకు నోటు కేసును తొక్కిపెడితే ఇప్పుడు కాళేశ్వరం అవినీతి ఫైల్స్ ను కాంగ్రెస్ తొక్కిపెండుతోందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ను కాపాటే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేతలతో పాటు ఢిల్లీలో కాంగ్రెస్ మిత్ర పక్ష నేతలు ఉన్నారని ధ్వజమెత్తారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గంలో జహీరాబాద్, మెదక్ బీజేపీ అభ్యర్థులు బిబి పాటిల్, రఘునందన్ రావుకు మద్దతుగా నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. 100 రోజుల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని వరికి రూ.500 బోనస్ ఇస్తామని దగా చేసిందని ధ్వజమెత్తారు.

ఫేక్ వీడియోలో ఉన్నవారిని వదిలేది లేదు:

మూడో సారి అధికారంలోకి వస్తే బీజేపీ రాజ్యాంగం రద్దు చేయబోతున్నదని, రిజర్వేషన్లను రద్దు తొలగిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాను బతికి ఉన్నంత కాలం ముస్లిం రిజర్వేషన్లు అమలు జరిగే ప్రసక్తే లేదని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు కాపాడుతానని హాట్ కామెంట్స్ చేశారు.. రాజ్యాంగం విషయంలో నన్ను శంకించడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మాకు రాజ్యాంగమే భారతం, రామాయణం, బైబిల్ ఖురాన్ అన్నారు. ఓటమి భయంతో ఫేక్ వీడియోల ద్వారా ప్రతిపక్షాలు ప్రజలను గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో డబుల్ ఆర్ (రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా) పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేక్ వీడియోలు విడుదల చేసే వారిని విడిచిపెట్టేది లేదన్నారు. ఈ డబుల్ ఆర్ కు ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రఘునందన్ రావు, బిబి పాటిల్ కు మీరు వేసే ఓటు నేరుగా ఢిల్లీలో ఉన్న మోడీకి చేరుతుందన్నారు. ఇండియా కూటమి కూటమికి ఈసారి చరిత్రలో ఎన్నడు లేనన్ని తక్కువ సీట్లు వస్తాయని ప్రతిపక్షాలు తాము గెలవకపోతే ఈవీఎంలపై కూడా నిందలు వేస్తారని ధ్వజమెత్తారు.

తెలంగాణ గడ్డ నుంచి ప్రకటిస్తున్నా..

రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోంది. మతపరమైన రిజర్వేషన్స్ ఉండొద్దని అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారు. కానీ ఇప్పుడు అంబేద్కర్ స్పూర్తికి రాహుల్ గాంధీ వెన్నుపోటు పొడుస్తున్నారు. తెలంగాణ గడ్డ నుంచి నేను ప్రకటిస్తున్నాను. మూడోసారి అధికారంలోకి వచ్చాక 75 ఏళ్ల రిపబ్లిక్ డే ను ఘనంగా నిర్వహిస్తాం. 2004, 09లో ఉమ్మడి ఏపీలో అత్యధికంగా కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల హక్కులను కాలరాశారు. ఓబీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ముస్లింలకు కట్టబెట్టారు. ఓట్ల కోసమే ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. తెలంగాణలో లింగాయత్ లు, మరాఠీలు ఓబీసీలోకి తమను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడి ప్రభుత్వాలకు వారిని ఓబీసీలుగా మార్చడం ఇష్టం లేదు. ముస్లింల మెప్పుకోసం ఓబీసీలకు అన్యాయం చేశారు. లంబాడి సమాజానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేశాయి. తాము ఎస్సీ వర్గీకరణకు కట్టుపడి ఉన్నామన్నారు.

కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్:

తెలుగు సినిమా ఇండస్ట్రీ త్రిపుల్ ఆర్ లాంటి సూపర్ హిట్ సినిమా ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ ట్యాక్స్ ఇచ్చిందని ఆరోపించారు. డబుల్ ఆర్ పేరుతో వ్యాపారుల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ట్సాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. ఈ సొమ్ము అంతా వెనుక డోర్ నుంచి ఢిల్లీకి చేరుతోందని, ఆర్ఆర్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ను అడ్డుకోకపోతే సర్వనాశనం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పంచసూత్రాలు అనే సూత్రంతో రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ పంచసూత్రాలు అంటే అవినీతి, అబద్ధాలు,మాఫియా, కుటుంబ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్వనాశనం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోంది. రాజకీయ సంకుచిత భావనతో అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. గడిచిన పదేళ్లలో తెలంగాణకు ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణం మోడీ వల్ల కాలేదు మీ అందరి ఓటు వల్ల సాధ్యం అయిందన్నారు.

Read More...

పోలీసులను కాదు.. సైనికులను తెచ్చుకో.. నోటీసులపై సీఎం రేవంత్ షాకింగ్స్ కామెంట్స్

Next Story

Most Viewed