ఎమ్మెల్యే VS కార్పొరేటర్.. కంటతడి పెట్టిన గొల్నాక మహిళా ప్రజాప్రతినిధి (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-10 15:29:02.0  )
ఎమ్మెల్యే VS కార్పొరేటర్.. కంటతడి పెట్టిన గొల్నాక మహిళా ప్రజాప్రతినిధి (వీడియో)
X

దిశ, అంబర్ పేట్ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ భర్త వాగ్వివాదానికి దిగారు. పూలే 197వ జయంతి వేడుకల సందర్భంగా అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో పూలే విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించడానికి గొల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. పూల మాలవేసి నివాళులర్పిస్తున్న సమయంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అక్కడికి చేరుకున్నారు.

అక్కడే ఉన్న కార్పొరేటర్ దూసరి లావణ్య భర్త దూసరి శ్రీనివాస్ గౌడ్‌కు వాగ్వివివాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరువురికి మాట మాట పెరిగి ఈరోజు నుంచి నీ అంతు చూస్తా అంటూ.. బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా దూసరి లావణ్య గౌడ్ మాట్లాడుతూ.. తమపై రాజకీయ కక్ష పెంచుకొని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ అధికార పార్టీ కార్పొరేటర్లపై దాడులు చేయడం సరైది కాదన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాల్సిన ఎమ్మెల్యే దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. దూసరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ను తాను మర్యాద పూర్వకంగా కలిసే సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు. ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని తనపై దాడి చేయడం జరిగిందని తెలిపారు.

రాజకీయాలకు వచ్చినప్పుడే తెగించి వచ్చానని, ఎమ్మెల్యే తనను చంపేసిన పర్వాలేదన్నారు. ఎమ్మెల్యేగా అంబర్ పేట్ నియోజకవర్గ ఏం అభివృద్ధి చేశారో చూపించాలని ప్రశ్నించారు. గొల్నాక కార్పొరేటర్‌గా తాను చేసిన డివిజన్ అభివృద్ధి చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై దాడి చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు.

పార్టీ అంటే గౌరవం లేదు :

అంబర్ పేట్ ఎమ్మెల్యే , కాలేరు వెంకటేష్

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అలీ కేఫ్ చౌరస్తాలో పూలమాల వేయడానికి వెళ్ళిన తాను అక్కడే ఉన్న గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య ఆమె భర్త దూసరి శ్రీనివాస్ గౌడ్ భుజంపై చేయి వేసి ఆత్మీయంగా పలకరించానని కానీ దాడి చేయలేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్పష్టం చేశారు. పార్టీ అన్నా.. ఎమ్మెల్యే అన్నా.. శ్రీనివాస్ గౌడ్ కు గౌరవం లేదని, పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా తనపై నిందలు వేయడం సరికాదన్నారు. తనతో ఎలాంటి తప్పు జరగలేదన్నారు

Advertisement

Next Story

Most Viewed