- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కాలనీపై అమాత్యుడి కన్ను..! రెండు ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీపై ఓ మంత్రి కన్నేశాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ కాలనీలో వాటా ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం. అందుకు హౌసింగ్ సోసైటీ అంగీకరించకపోవడంతో తన పవర్‌ను ఉపయోగించి, రిజిస్ట్రేషన్లు అడ్డుకుంటున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఆ కాలనీలో ఫ్లాట్ల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఎవరైన ధైర్యం చేసి, ఎందుకు రిజిస్ట్రేషన్లు చేయరు? అని అడిగితే అధికారులు బెదిరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఆ నోటా, ఈ నోటా సీఎం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది.
ముందు పలకరింపు.. తర్వాత బెదిరింపు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే చిత్రపురి హౌసింగ్ సోసైటీ ప్రతినిధులకు ఓ మంత్రి కబురు పెట్టారు. దీంతో సభ్యులు సదరు మంత్రిని కలిశారు. యోగ క్షేమాలు మాట్లాడిన తర్వాత సోసైటీ విషయాలపై ఆయన ఆరా తీశారు. సపోర్టుగా ఉంటానని భరోసా కల్పించారు. ఇప్పటి నుంచి తాను చెప్పినట్టుగా నడుచుకోవాలని సూచిస్తూ.. కాలనీలో వాటా ఇవ్వాలని, తనకు 2 ఫ్లాట్లు కేటాయించాలని ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. దీంతో సోసైటీ ప్రతినిధులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మళ్లీ వచ్చి కలుస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రోజులు గడుస్తున్నా సోసైటీ ప్రతినిధులు మళ్లీ రాకపోవడంతో మంత్రి కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టినట్టు సమాచారం. జిల్లాకు చెందిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఫోన్ చేసి, చిత్రపురి కాలనీలో తనకు తెలియకుండా ఒక్క ఫ్లాట్ సైతం రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆదేశించినట్టు తెలుస్తున్నది. దీంతో ఆ కాలనీలోని ఫ్లాట్లను అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
మంత్రికి అధికారుల సపోర్ట్
రిజిస్ట్రేషన్ అధికారులు సైతం మంత్రికి సపోర్ట్ చేస్తూ సోసైటీ ప్రతినిధులను బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ‘మంత్రి చెప్పినట్టుగా వినండి. ఆయనకు 2 ఫ్లాట్లు ఇవ్వండి. లేకపోతే రిజిస్ట్రేషన్లు జరగవు’ అని ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి అన్ని క్లియరెన్సులు వచ్చిన తర్వాతే చిత్రపురిలో నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు ఉన్నట్టుండి వాటి రిజిస్ట్రేషన్లు నిలిపేయడం ఏంటని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లను ఆపడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తే అధికారులు బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి కీలక అధికారికి ఫిర్యాదులు రావడంతో ఆయన జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆయన సైతం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని సమాచారం.
శాఖతో సంబంధం లేకున్నా జోక్యం
నిజానికి సదరు మంత్రికి రిజిస్ట్రేషన్ శాఖతో సంబంధం లేదు. అయినా ఆ శాఖ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు మంత్రి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం కొత్తేమీ కాదని టాక్. కార్మికుల ఇండ్ల జోలికి వెళ్లడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న చర్చ జరుగుతున్నది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం వెళ్లినట్టు తెలిసింది. ఇంతకాలం లోకసభ ఎన్నికల వల్ల ఆ విషయాన్ని ఆయన పట్టించుకోలేదని, ఇప్పుడు సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టే చాన్స్ ఉన్నట్టు టాక్.
4 నెలలుగా క్రయవిక్రయాలు బంద్
సోసైటీలోని ప్లాట్లకు సుమారు నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు తమ పిల్లల పెళ్లి కోసం ప్లాట్లను విక్రయించారు. కానీ రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో కొనుగోలుదారులు పూర్తి అమౌంట్ ఇవ్వలేదు. ఫలితంగా ఆ పెళ్లిల్లు వాయిదా పడ్డాయి. కొందరు లోన్ ద్వారా ప్లాట్లను కొనుగోలు చేశారు. కానీ రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో బ్యాంకులు లోన్ అమౌంట్‌ను విడుదల చేయడం లేదు.
వివాదాలకు కేరాఫ్ చిత్రపురి
మొదటి నుంచీ చిత్రపురి కాలనీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సినిమా పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తులకు ఫ్లాట్లు ఇచ్చారనే ఫిర్యాదులు వచ్చాయి. రాజకీయ పలుకుపడి ఉన్న వ్యక్తులు హౌసింగ్ సోసైటీని బెదిరించి ప్లాట్లను తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఖాజాగూడలో 67 ఎకరాల భూమిని కేటాయించారు. కార్మికులు ఓ సోసైటీగా ఏర్పడి అక్కడ అపార్ట్‌మెంట్స్ నిర్మించారు. సుమారు 2,300 మందికి ఫ్లాట్లు కేటాయించారు. ఆ చుట్టు పక్కల ఐటీ కంపెనీలు రావడంతో ఆ కాలనీకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ ఒక్కో ఫ్లాట్ రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు ధర పలుకుతున్నది.