Minister Sridhar Babu : మూసీ పునరుజ్జీవనంపై మండలిలో మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-17 09:12:56.0  )
Minister Sridhar Babu : మూసీ పునరుజ్జీవనంపై మండలిలో మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : 2014లో బీఆర్ఎస్ మూసీ(Revival of Musi)ప్రక్షాళన చేస్తామని, కాలుష్య రహితంగా మారుస్తామని ప్రకటించి పదేళ్లు గడిచినా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)విమర్శించారు. మూసీ పునరుజ్జీవనం కార్యక్రమంతో బీఆరెఎస్ ఎమ్మెల్సీ కవిత, రాజు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు మూసీ సుందరీకరణ కోసం డీపీఆర్ ఇప్పుడు చేస్తున్నామంటున్నారని, మరి డీపీఆర్ చేయకుండా వరల్డ్ బ్యాంకుకు రూ.4100 కోట్లు అప్పు కావాలని ఎలా అడిగారని ప్రశ్నించారు. మూసీ డీపీఆర్ ఇంకా అవ్వకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి రూ. 14 వేల కోట్లు కావాలని ఏ ప్రాతిపదికన అడిగారని కవిత నిలదీశారు. మూసీ అభివృద్ధి పేరిట ఆ ప‌రివాహ‌క ప్రాంతంలో కూల‌గొట్టిన ఇండ్ల ఈఎంఐలను ప్రభుత్వం చెల్లిస్తుందా అని ప్రశ్నించారు. మూసీ నదిగర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్లంతట వాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోందని... కానీ హృదయవిదారకమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవాసస్తవమని స్పష్టమవుతోందన్నారు. ఆ 309 కుటుంబాలు ఖాళీకి సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. అలాగే 181 కుటుంబాలు తామంతట తామే కూల్చేసుకొని వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోండటం..వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ మూసీ అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(MRDCL) ద్వారా డీపీఆర్ ను చేస్తున్నామని తెలిపారు. వరల్డ్ బ్యాంకుకు ప్రభుత్వం ఇచ్చిన రూ. 4,100కోట్ల ప్రతిపాదనలు మూసీ ప్రక్షాళన ప్రతిపాదనలు కాదని, మూసీ ఇరువైపుల ట్రంక్ సివరేజీ లైన్లు కావాలని మెట్రో వాటర్ వర్క్స్ ఎస్టిమేట్స్ అని స్పష్టం చేశారు. డీపీఆర్ ఫైనలైజ్ కాదని, నిధులపైన స్పష్టత ఇంకా లేదన్నారు. మూసీ రివర్ బెడ్ లో నివసిస్తున్న పేదలకు మంచి నాణ్యమైన జీవనం అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. సుందరీకరణ అంటే అక్కడి పేదల జీవితాల్లో తీసుకొచ్చే అంశమన్నారు.

1లక్ష 50వేల కోట్ల నిధులపై ప్రతిపక్షాలకు రాద్ధాంతం అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనలో చెప్పిన లక్షన్నర కోట్లు మొత్తం అవటర్ రింగ్ రోడ్డు వరకు చేపట్టా్ల్సిన రోడ్లు, కారిడార్లు, లింక్ రోడ్లు, ఎఫ్టీసీలు, గోదావరి నీటి తరలింపు, మెట్రో విస్తరణ, మూసీ నిర్వాసితులకు సహాయ, పునరావాసాలు వంటి వాటికి సంబంధించిన ఖర్చులన్ని ఉన్నాయన్నారు. మూసీ బఫర్ జోన్ ను 30మీటర్ల నుంచి 50మీటర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వమే పెంచిందన్నారు. రివర్ బెడ్ నిర్వాసితుల సంఖ్యను 7వేలకు చూపించగా, బఫర్ జోన్ లో 2,108 నిర్వాసితుల సంఖ్యను గుర్తించగా.. నేడు ఆ సంఖ్య పెరిగిపోయిందన్నారు. లక్ష ఇండ్లకు మార్కింగ్ చేశామంటున్నారని, బఫర్ జోన్ లో అసలే మార్కింగ్ చేయలేదని దీనిపై ప్రతిపక్ష సభ్యులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. 2,116 ఇండ్లు రివర్ బెడ్ లో ముంపుకు గురవుతున్నాయని, వాటిలో 309ఇండ్లకు కలెక్టర్ ఇన్సెంట్ ఇచ్చారన్నారు. 715బఫర్ జోన్ లో గుర్తించామన్నారు. మానవీయ కోణంలో రివర్ బెడ్ లో కట్టుకున్న ఇండ్లకు డబ్బులు ఇస్తున్నామన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం నామమాత్రంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డబుల్ ఇండ్లను అసంపూర్తిగా నిర్మిస్తే తాము వాటిని పూర్తి చేసి పేదలకు, నిర్వాసితులకు అందిస్తున్నామన్నారు. రివర్ బెడ్, బఫర్ జోన్ లో పట్టాలుంటే 2013భూసేకరణ చట్టం మేరకు పరిహారం అందిస్తామన్నారు. అవుటర్ పరిధిలో గ్రేటర్ ఆవల ఉన్న ఎఫ్టీసీలు, పరిశ్రమలతో నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. డీపీఆర్ తర్వాతా వాటన్నింటిపై స్పష్టత వస్తుందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. టూరిజాన్ని కూడా ఇందులో భాగంగా అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ పునరుజ్జీవనం నిర్వాసితులకు సంబంధించి మా ప్రభుత్వం అన్ని సహాయ, పునరావస చర్యలకు కట్టుబడి ఉందని, ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్ల కుండా న్యాయం చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed