సీడబ్ల్యూసీలో నేడు తెలంగాణ పాలనపై చర్చకు చాన్స్.. సమావేశాలపై మంత్రి సీతక్క, ఎంపీ చామల కామెంట్స్

by Ramesh N |
సీడబ్ల్యూసీలో నేడు తెలంగాణ పాలనపై చర్చకు చాన్స్.. సమావేశాలపై మంత్రి సీతక్క, ఎంపీ చామల కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీడబ్ల్యూసీ (CWC meeting) సమావేశంలో నిన్న 2029 ఎన్నికలపై చర్చ జరిగిందని, సమావేశంలో 7 రకాల తీర్మానాలను ఆమోదించారని (Congress) కాంగ్రెస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అనంతరం ఇవాళ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran) మీడియాతో మాట్లాడుతూ.. నిన్న సీడబ్ల్యూసీలో 2029 ఎన్నికలపై చర్చ జరిగిందని ఎంపీ చామల చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అగ్ర నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిగాయన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నేడు సీడబ్ల్యూసీ ఎక్స్‌టెన్షన్ మీటింగ్ జరుగుతోందని, కేరళ బీహార్ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేడు ఏఐసీసీ పెద్దలు మాకు దిశానిర్దేశం చేస్తారని స్పష్టం చేశారు. తెలంగాణలో పాలనపై ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా సీడబ్ల్యూసీ సమావేశాలపై మీడియాతో మంత్రి సీతక్క (Minister Seethakka) మాట్లాడుతూ.. సమావేశంలో 7 రకాల తీర్మానాలను ఆమోదించారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ(జై బాపు, జై భీమ్, జై సంవిధాన్) విధానాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి పార్టీని డెవలెప్‌మెంట్ చేయాలనేది ప్రతిభ పూనారని చెప్పుకొచ్చారు. దేశంలో బీజేపీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తుందని, దాని మూలంగా దేశ ప్రజలు భాగాలుగా విడిపోతున్నారని ఆరోపించారు. అధికారం కోసం ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని మండిపడ్డారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చామని, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed