పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌ను భారత్‌కు ఆహ్వానించిన నీరజ్ చోప్రా.. ఎందుకంటే..?

by Mahesh |   ( Updated:2025-04-22 06:31:47.0  )
పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌ను భారత్‌కు ఆహ్వానించిన నీరజ్ చోప్రా.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra), పాకిస్తాన్ ఒలింపిక్ బంగారు పతక విజేత అర్షద్ నదీమ్‌ (Arshad Nadeem) భారత్ రావాలని ఆహ్వానించారు. 2025 మే 24న బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగే తొలి నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో (Neeraj Chopra Classic Javelin Throw)కి హాజరవ్వాలని నీరజ్ చోప్రా అర్షద్‌ను కోరారు. కాగా ఈ ఈవెంట్‌ను JSW స్పోర్ట్స్ సహకారంతో నీరజ్ చోప్రా నిర్వహిస్తున్నారు. ఇది వరల్డ్ అథ్లెటిక్స్ ఆమోదించిన 'A' కేటగిరీ ఈవెంట్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను అర్షద్ నదీమ్ తో మాట్లాడి.. బెంగళూరు వచ్చి తన ఈవెంట్‌లో పాల్గోనాలని ఆహ్వానించాను. ఆయన తన కోచ్ తో చర్చించిన తర్వాత నిర్ణయం తెలియజేస్తానని చెప్పాడు. అలాగే ఒక వేల ఈ ఈవెంట్‌కు అర్షద్ పాల్గొంటే, భారత్-పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రభుత్వ అనుమతి అవసరం కావచ్చని నీరజ్ తెలిపారు.

ఈ ఈవెంట్‌లో గ్రెనడాకు చెందిన రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన ఆండర్సన్ పీటర్స్ (Anderson Peters), కెన్యాకు చెందిన ఒలింపిక్ మెడలిస్ట్ జూలియస్ యెగో (Julius Yego), జర్మనీకి చెందిన మాజీ ఒలింపిక్ ఛాంపియన్ థామస్ రోహ్లర్, అమెరికాకు చెందిన కర్టిస్ థాంప్సన్ వంటి అగ్రశ్రేణి జావెలిన్ త్రోయర్లు పాల్గొననున్నట్లు నీరజ్ తెలిపారు.. భారత్ నుంచి నీరజ్‌తో పాటు రోహిత్ యాదవ్ సహా 3-4 మంది అథ్లెట్లు పాల్గొంటారు. ఇదిలా ఉంటే నీరజ్, అర్షద్ (Neeraj, Arshad) ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ వంటి అంతర్జాతీయ ఈవెంట్లలో స్నేహపూరిత పోటీని కొనసాగిస్తున్నారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అర్షద్ 92.97 మీటర్లతో ఒలింపిక్ రికార్డు సృష్టించి బంగారు పతకం సాధించగా, నీరజ్ 89.45 మీటర్లతో రజతం నెగ్గారు. అర్షద్ ఈ టోర్నిలో పాల్గొంటే.. ఈ ఈవెంట్ దక్షిణాసియా క్రీడల్లో ఒక చారిత్రక క్షణంగా నిలుస్తుంది. అలాగే ఈ పోటీ ఇరు దేశాల అభిమానులకు ఉత్సాహాన్ని పెంచడంతో పాటు ఈవెంట్ పై ఆసక్తిని పెంచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



Next Story