బీఆర్ఎస్ నాయకులకు కామన్సెన్స్ ఉందా..? మంత్రి పొన్నం సీరియస్

by Satheesh |
బీఆర్ఎస్ నాయకులకు కామన్సెన్స్ ఉందా..? మంత్రి పొన్నం సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేపు సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కోరితే ఛాన్స్ ఇచ్చారా? ఇప్పుడు వచ్చి తమకు అవకాశం కల్పించాలని అడగడానికి కామన్సెన్స్ ఉండాలి కదా అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పొన్నం.. ఆనాడు కేసీఆర్ ప్రజెంటేషన్ సందర్భంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి ఉంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుల్లో కుంగిపోయిన ఘటనలు ఉండేవి కాదన్నారు. రేపు తమ ప్రభుత్వం చెప్పబోయేది గొప్పలు కాదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించబోతున్నామన్నారు.

దీంట్లో రాజకీయం ఏమి లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా బాగానే ఉంటే భుజాలెందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారని, ప్రభుత్వం మారిందని గ్రహించాలన్నారు. మేమిచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని ఇంతలోనే బీఆర్ఎస్ నేతలు ఆత్రపడుతున్నారని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లుగా వారిది గొప్ప పరిపాలనే అయితే ప్రజావాణికి వేలాది దరఖాస్తులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు.

కేంద్రం నియంతృత్వం పోకడ ఆపాలి:

పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే కేంద్రం ప్రతిపక్ష సభ్యులను సస్పెన్షన్ చేస్తోందని కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ సిఫార్సు వల్ల నిందితులకు పాస్‌లు వచ్చాయని నిందితులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఘటన జరిగి వారం రోజులైనా దోషులపై చర్యలు లేవని, పార్లమెంట్ భద్రత అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed