నన్ను నమ్మి అప్పటివరకు ఆగండి.. వీఆర్ఏలకు కేటీఆర్ రిక్వెస్ట్

by GSrikanth |
నన్ను నమ్మి అప్పటివరకు ఆగండి.. వీఆర్ఏలకు కేటీఆర్ రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలతో మంత్రి కేటీఆర్ అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఆందోళనను తక్షణం విరమించాల్సిందిగా మంత్రి సూచించారు. ఈ నెల 18 తర్వాత సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటామని, అప్పటివరకూ ఓపిక పట్టాలంటూ వారికి విజ్ఞప్తి చేశారు. మంత్రిగా తనపైన నమ్మకం ఉంచాలని కోరారు. కానీ వీఆర్ఏలు మాత్రం 2015లో ప్రగతి భవన్‌లోనే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ, అపరిష్కృతంగానే ఉండిపోయాయని మంత్రికి గుర్తుచేశారు. రెండేళ్ల క్రితం సెప్టెంబరు 9న కూడా అసెంబ్లీ సాక్షిగా ఇదే తరహా హామీ ఇచ్చారని, ఇప్పటికీ పరిష్కారం కాలేదని వివరించారు. రెండు అనుభవాలను చూసిన తర్వాత తమకు నమ్మకం లేదని మంత్రి కేటీఆర్‌కు ముఖం మీదనే తేల్చి చెప్పారు. మొత్త, 15 మంది ప్రతినిధులతో కేటీఆర్ జరిపిన ఈ చర్చల్లో చివరకు ఈ నెల 20న మరోమారు చర్చించుకుందామని, ఆలోచించుకోవాలని ఆఫర్ ఇచ్చారు.

ఈ చర్చల అనంతరం బైటకు వచ్చిన వీఆర్ఏలు మాత్రం తమంతట తాముగా నిర్ణయం తీసుకోలేమని, ఆందోళన చేస్తున్న అన్ని జిల్లాల ప్రతినిధులతో మాట్లాడిన తర్వాతనే స్పష్టమైన డెసిషన్ తీసుకుంటామని వివరించారు. మరోవైపు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన వందలాది మంది వీఆర్ఏలు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జి చేసి అరెస్టు చేశారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గరే మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వేల సంఖ్యలో అసెంబ్లీ ముట్టడికి వస్తారనే సమాచారాన్ని ఇంటెలిజెన్స్ విభాగం పసిగట్టలేకపోయింది. ఒక్కసారిగా మేలుకున్న పోలీసులు 144 సెక్షన్ విధించారు.

Advertisement

Next Story